Elon Musk on Twitter | ట్విట్టర్ టేకోవర్ డీల్‌పై ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో స్పామ్, ఫేక్ అకౌంట్ల (నకిలీ ఖాతా)పై తాను అడిగిన డేటా ఇవ్వకుంటే ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు సిద్ధమని సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ యాజమాన్యానికి లేఖ రాశారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఆ సంస్థ యాజమాన్యంతో ఎలన్‌మస్క్‌కు అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని ఎలన్‌మస్క్ ఆరోపించారు.
విలీన ఒప్పందం నుంచి వైదొలిగేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నాయని మస్క్ పేర్కొన్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించిన డేటా కోసం వేచి ఉన్నానని, అప్పటి వరకు ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. విలీన ఒప్పందానికి లోబడి పూర్తి సమాచారం షేర్ చేయడానికి ట్విట్టర్ నిరాకరిస్తున్నదని మస్స్ నమ్ముతున్నారని ఆయన లాయర్ తెలిపారు.
ట్విట్టర్ తన నివేదికలో పేర్కొన్నట్లు ఐదు శాతానికంటే తక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నట్లు ఆధారాలు చూపాలని మస్క్ అంటున్నారు. ట్విట్టర్ నివేదిక కంటే నాలుగు రెట్లు ఎక్కువగా నకిలీ ఖాతాలు ఉన్నాయని చెబుతున్నారు. స్టాక్ ఎక్స్చేంజ్లకు ట్విట్టర్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే దాని కొనుగోలుకు ముందుకు వచ్చానని గుర్తు చేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ ఒప్పందంలో ముఖ్యమైన రెగ్యులేటరీ వెయింటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఎలన్‌మస్క్ లేఖ రాయడం గమనార్హం. అంతే కాదు. బహిరంగంగా అవసరమైతే ట్విట్టర్ టేకోవర్ డీల్ నుంచి వైదొలుగుతానని హెచ్చరించడం కూడా ఇదే మొదటిసారి.