Elon Musk | ఎలన్‌మస్క్.. గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో.. ప్రస్తుతం మార్కెటింగ్‌లో ట్రెండ్ సెట్టర్. ఇటీవల స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్లు దూసుకెళ్లిన తీరును పరిగణనలోకి తీసుకుంటే ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద త్వరలోనే 300 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నది. 50 ఏండ్ల ఈ పారిశ్రామికవేత్త వ్యక్తిగత సంపద బుధవారం 287 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడి హోదా పొందిన ఎలన్‌మస్క్.. జెఫ్ బెజోస్ కంటే 91 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు.
సోమవారం టెస్లా షేర్లు 12.7 శాతం పెరిగిపోవడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక్కరోజే 36 బిలియన్ డాలర్లు పెరిగి కూర్చుంది. కార్ల రెంటల్ సంస్థ హెర్ట్జ్.. లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ చేసిన వెంటనే ఆ స్క్రిప్ట్ విలువ పెరుగడం గమనార్హం. 2022 నాటికి హెర్ట్స్ సంస్థకు టెస్లా సంస్థ లక్ష కార్లను డెలివరీ చేయనున్నదని తెలుస్తోంది.
సింగిల్‌డేలో భారీగా సంపద పెంచుకున్న ఎలన్‌మస్క్ వెల్త్.. అమెరికా జీడీపీలో 1.37 శాతం. ప్రపంచంలోని టాప్ 500 కుబేరుల్లో 3.37 శాతం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటాతో పోలిస్తే రెట్టింపుకు పైగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వ్యక్తిగత సంపద డబుల్ కంటే ఎక్కువ. ముకేశ్ అంబానీ నికర వ్యక్తిగత సంపద కంటే 200 బిలియన్డాలర్లు ఎక్కువ.