Elon Musk | సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ టేకోవర్ కోసం జరిగిన న్యాయ పోరాటంలో ఓ న్యాయవాద సంస్థ అధిక ఫీజు వసూలు చేసిందని ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ ఆరోపించారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న లా ఫర్మ్.. తన వద్ద 90 మిలియన్ డాలర్ల బిల్లు వసూలు చేసిందంటూ మరో న్యాయ పోరాటానికి దిగారు. అమెరికాలో పేరొందిన లాభదాయక సంస్థల్లో వాచ్ టెల్ లిప్టన్ రోజెన్ అండ్ కట్జ్ ఒకటి. గతేడాది ట్విట్టర్’ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలన్న ఒప్పంద సమయాన్ని సదరు లా ఫర్మ్ తనకు అనుకూలంగా మార్చుకుందని ట్విట్టర్ పేరెంట్ సంస్థ, ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ట్విట్టర్’ను 44 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు టేకోవర్ చేయడానికి వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్‌తో నాలుగు నెలలు పాటు జరిగిన న్యాయ పోరాటంలో వాచ్‌టెల్ న్యాయవాదులకు గంటల ప్రాతిపదికన ఫీజు చెల్లించడానికి ట్విట్టర్ అంగీకరించింది. కానీ, సదరు లా ఫర్మ్ ‘నైతిక విధులు’ ఉల్లంఘించి నాలుగు నెలల ప్రాతినిధ్యానికి వాచ్ టెల్.. భారీ మొత్తంలో బోనస్ ఫీజు వసూలు చేసిందని ఎలన్ మస్క్ ఫిర్యాదు సారాంశం.
ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత.. సంస్థ మాజీ ఉద్యోగులకు మిలియన్ డాలర్ల ఖర్చులు చెల్లించకపోవడంతో ట్విట్టర్ యాజమాన్యంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ట్విట్టర్‌కు వ్యతిరేకంగా మాజీ ఉద్యోగులు, వెండార్లు, భూస్వాములు పిటిషన్లు దాఖలు చేశారు.