Electronics Jobs | వచ్చే మూడేండ్లలో (2027 నాటికి) దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో 1.2 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని ఓ అధ్యయనం తెలిపింది. అందులో 30 లక్షలు ప్రత్యక్షంగా, 90 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా లభిస్తాయని టీం లీజ్ డిగ్రీ అప్రంటిస్ షిప్ నివేదిక పేర్కొంది. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో సుమారు పది లక్షల మంది ఇంజినీర్లు, 20 లక్షల మంది ఐటీఐ సర్టిఫైడ్ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. నాన్ టెక్నికల్ ఉద్యోగాల్లో 90 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుందని టీం లీజ్ డిగ్రీ అప్రంటిస్ షిప్ నివేదిక పేర్కొంది.
2030 నాటికి 500 బిలియన్ డాలర్ల విలువ గల ఉత్పత్తులను తయారు చేయాలని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేదించాలని వచ్చే ఐదేండ్లలో ఎలక్ట్రానిక్స్ రంగం ఐదు రెట్లు తప్పనిసరిగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తద్వారా 400 బిలియన్ డాలర్ల విలువ గల ఉత్పత్తుల తయారీకి గల గ్యాప్ భర్తీ అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 101 బిలియన్ డాలర్ల విలువ గల మొబైల్ ఫోన్లు 43 శాతం, 12 శాతం చొప్పున కన్జూమర్, ఇండస్ట్రీయల్ ఎలక్ట్రానిక్స్, 11 శాతం ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ తయారు చేస్తోంది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ.
వీటితోపాటు 8 శాతం ఆటో ఎలక్ట్రానిక్స్, మూడు శాతం ఎల్ఈడీ లైటింగ్, ఒక శాతం వేరబుల్స్ అండ్ ఇయరబుల్స్, ఒకశాతం పీసీబీఏస్ తయారు చేయాల్సి ఉంటుంది. త్వరితగతిన భారత్ ఎలక్ట్రానిక్ రంగం గ్లోబల్ ఎలక్ట్రానిక్ హబ్ గా అవతరిస్తోంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ లో భారత్ వాటా 3.3 శాతం కాగా, విదేశాలకు 2022-23లో భారత్ వాణిజ్య ఎగుమతుల్లో 5.3 శాతం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులేనని టీం లీజ్ డిగ్రీ అప్రెంటిస్ షిప్ చీఫ్ స్ట్రాటర్జీ ఆఫీసర్ సుమిత్ కుమార్ తెలిపారు.