EV Scooter Indy | బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘రివర్` దేశీయ మార్కెట్లోకి గురువారం న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఇండీ’ని ఆవిష్కరించింది. ఇది ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఇది మూడు రైడింగ్ మోడ్లలో యూజర్లకు అందుబాటులోకి వస్తున్నది. ఎకో, రైడ్, రష్ మోడ్ల్లో ఈ స్కూటర్ సిద్ధమైంది. దీని ప్రారంభ ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఆసక్తిగల వారు రూ.1250 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు కంపెనీ వెబ్ సైట్ లో ప్రీ-బుకింగ్ ఫెసిలిటీ కల్పించింది రివర్.
రివర్ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 6.7 కిలోవాట్ల పవర్ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. కేవలం 3.9 సెకన్లలో 40 కి.మీ. వేగంతో దూసుకెళ్ల సామర్థ్యం దీని సొంతం. ఈ స్కూటర్ బ్యాటరీ 80 శాతం చార్జింగ్ కావడానికి ఐదు గంటల సమయం పడుతుంది.
ఎకో మోడల్ ఇండీ స్కూటర్ ఫుల్ చార్జింగ్ చేస్తే 120 కి.మీ. వరకు దూసుకెళ్తుంది. గరిష్టంగా 90 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌కు డిజిటల్ స్క్రీన్, రెండు యూఎస్బీ పోర్ట్స్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ జత చేశారు. పూర్తిగా డబ్బు చెల్లించిన యూజర్లకు వచ్చే ఆగస్టు నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. ఈ స్కూటర్‌కి, బ్యాటరీకి ఐదేండ్లు లేదా 50 వేల కి.మీ. వారంటీ అందిస్తున్నది రివర్.