న్యూఢిల్లీ, జనవరి 27: ఇది ఎన్నికల సంవత్సరమైనందున ఫిబ్రవరి 1న లోక్‌సభకు సమర్పించబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కల్పించే చర్యలు ఉంటాయని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గించే కొద్దిపాటి వరాల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించవచ్చని అంటున్నారు. వాస్తవానికి ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ, ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ తరహాలోనే ప్రతిపాదనలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ జైన్ చెప్పారు.
కొత్త పన్ను విధానంలోకి మారేందుకు ప్రోత్సాహకంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 87ఏ కింద మరికొంత రాయితీ ఇవ్వవచ్చని, ట్యాక్స్ రిబేట్లతో కలుపుకుని పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచే చాన్స్ ఉందని జైన్ వివరించారు. కొత్త పన్ను పద్ధతిలో ప్రస్తుత బేసిక్ లిమిట్ రూ.3 లక్షలుకాగా, దానిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం కూడా ఉన్నదని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు.
80సీ, 80డీ పరిమితులు పెంచవచ్చు
ఎన్నికల సంవత్సరమైనందున సామాన్య వేతన జీవులకు బహుమతిగా పన్ను ఆదాయంపై ఇప్పుడు అమలవుతున్న దిగువస్థాయి శ్లాబ్ రేట్లను తగ్గించవచ్చని శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్ అండ్ కో సీనియర్ అడ్వయిజర్ సంజీవ్ మల్హోత్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త పన్ను విధానాన్నే పన్ను చెల్లింపుదారులు అనుసరించాలన్నది ప్రభుత్వ అభిమతం అయినప్పటికీ, పాత, కొత్త పద్ధతుల్లో ఒకదానిని ఎంచుకునే ఆప్షన్ కొనసాగిస్తుందని భావిస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. పాత పన్ను పద్ధతిలో పొదుపు పత్రాలు, బీమా ప్రీమియంలు, గృహ రుణాలపై వడ్డీ తదితరాలకు సెక్షన్లు 80సీ, 80డీల కింద ప్రస్తుతం ఉన్న పరిమితుల్ని పెంచే చాన్స్ ఉన్నదన్నారు. భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎన్జీ ఖైతాన్ తన అంచనాల్ని వెల్లడిస్తూ వేతన జీవుల పన్ను భారం తగ్గేరీతిలో మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయన్నారు.
ఈవీలపై పన్నులు తగ్గించండి
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు గంపెడు ఆశపెట్టుకుంటున్నారు. ఈసారి బడ్జెట్లో హైబ్రిడ్ వాహనాలతోపాటు ఈవీ విడిభాగాలపై తక్కువ జీఎస్టీని విధించాలని ప్రభుత్వానికి ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఫేమ్3 స్కీంను ప్రవేశపెట్టాలని, లిథియం-అయాన్ బ్యాటరీలపై జీఎస్టీని తగ్గించాలని, ఎంట్రీలెవల్ ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తుతం వీటిపై 18 శాతం పన్నును వసూలు చేస్తున్నారు.