ముంబై, సెప్టెంబర్ 27 : క్యాష్ మార్కెట్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సెగ్మెంట్లలో లావాదేవీ ఫీజులను బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లు శుక్రవారం సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆదేశానుసారం స్టాక్ ఎక్సేంజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం క్యాష్ మార్కెట్లో లావాదేవీ ఫీజు ట్రేడెడ్ వాల్యూలో లక్షకు రూ.2.97 చొప్పున ఉంటుంది. ఇక ఈక్విటీ డెరివేటివ్స్లోనైతే ఫ్యూచర్స్ సెగ్మెంట్‌కు ట్రాన్జాక్షన్ ఫీ.. ట్రేడెడ్ వాల్యూలో లక్షకు రూ.1.73గా ఉన్నది. అదే ఆప్షన్స్ సెగ్మెంట్‌కు ప్రీమియం వాల్యూలో లక్షకు రూ.35.03గా ఉన్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. అలాగే కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్ కోసం లావాదేవీ ఫీజును ట్రేడెడ్ వాల్యూలో లక్షకు 35 పైసలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నది. ఆప్షన్స్-ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్స్లోనైతే ప్రీమియం వాల్యూలో లక్షకు ఈ ఫీజు రూ.31.1గా ఉన్నది. బీఎస్ఈ వివరాల ప్రకారం కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ (క్రాస్-కరెన్సీ ఫ్యూచర్స్సహా)ల్లో టర్నోవర్ వాల్యూలో కోటికి రూ.45గా చార్జీని నిర్ణయించారు. ఆప్షన్స్ (క్రాస్-కరెన్సీ ఆప్షన్స్సహా)ల్లో ప్రీమియం టర్నోవర్ వాల్యూలో కోటికి రూ.100గా ఫీజు ఉంటుంది. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ కోసం సెన్సెక్స్, బ్యాంకింగ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్కూ సవరించిన ఫీజులే వర్తిస్తాయి.