ED attaches Unitech Binamies | యునిటెక్ గ్రూప్‌కు చెందిన రూ.18.14 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని గుర్గావ్లో మల్టీప్లెక్స్, గుర్గావ్తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆరు కమర్షియల్ కాంప్లెక్స్‌లను జప్తు చేశామన్నది. ఇంకా 24 బ్యాంకు ఖాతాలను, ఫిక్స్డ్ డిపాజిట్లను స్తంభింపజేసింది. వీటి విలువ మొత్తం రూ.18.14 కోట్లు ఉంటుందని వివరించింది.
యునిటెక్ గ్రూప్ ప్రమోటర్లు అజయ్ చంద్ర,సంజయ్ చంద్రల బినామీ ఆస్తులను.. ఎన్నోవా ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫ్ఎన్ఎం ప్రాపర్టీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రిజిస్టర్ చేశారని ఈడీ తెలిపింది. చంద్రాస్ తమకు అత్యంత సన్నిహితుల ద్వారా ఈ ఆస్తులను నిర్వహిస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో యునిటెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు అజయ్ చంద్రా, సంజయ్ చంద్రాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సైప్రస్, కేమ్యాన్ ఐలాండ్స్కు యునిటెక్ ప్రమోటర్లు రూ.2000 కోట్ల మేరకు మళ్లించారన్న అభియోగాలు రికార్డు చేసింది. ఇప్పటి వరకు జప్తు చేసిన యునిటెక్ ఆస్తుల విలువ రూ.690.66 కోట్లకు చేరుకున్నది. గత నెలలో యునిటెక్ ఫౌండర్ రమేశ్ చం్ర, ఆయన కోడలు ప్రీతి చంద్ర, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది.