న్యూఢిల్లీ, నవంబర్ 19: ఈ-కామర్స్ జెప్టో తాజాగా కేఫ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో 120 కేఫ్స్లను ఏర్పాటు చేసిన సంస్థ..త్వరలో హైదరాబాద్‌లో అడుగపెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2026 నాటికి కేఫ్ వ్యాపారం ద్వారా రూ.1,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. అందుకు తగ్గట్టుగానే తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్లు జెప్టో సీఈవో అదిత్ పాలిచా తెలిపారు. పది నిమిషాల్లో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించే సర్వీసులకు అనూహ్యంగా స్పందన లభించిందని, ఇదే క్రమంలో గతేడాదిగా మా బృందం కేఫ్‌ల కోసం ఎంతో పరిశోధన చేశారని, చేతితో తయారు చేసిన బ్రూయింగ్ టెక్నికల్‌ను ఉపయోగించి కాఫీను తయారు చేసే యంత్రాలను సేకరించినట్లు, తద్వారా కస్టమర్లకు కాఫీని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కేఫ్ సర్వీసుల్లో 148 ఐటమ్స్‌ను అందిస్తున్నట్లు, బుకింగ్ చేసుకున్న పది నిమిషాల్లో ఇస్తున్నామన్నారు.
అర్వతో ప్యూర్ ఈవీ ఒప్పందం
హైదరాబాద్, నవంబర్ 19: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయ సంస్థ ప్యూర్ ఈవీ.. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో తన వాహనాలను విక్రయించడానికి అర్వ ఎలక్ట్రిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. అక్కడి మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్లను విక్రయించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చేరెండేండ్లలో 50 వేల యూనిట్ల ఎకోడ్రైఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటార్‌సైకిళ్లను సరఫరా చేయనున్నది.
రెడ్డీస్ ప్లాంట్‌పై యూఎస్ అభ్యంతరాలు
హైదరాబాద్, నవంబర్ 19: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని బొల్లారం వద్ద ఉన్న ప్లాంట్‌ను అమెరికా హెల్త్ రెగ్యులేటరీ తనిఖీ చేసి ఏడు అభ్యంతరాలతో ఫామ్ 484 జారీ చేసిందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. బొల్లారం వద్ద ఉన్న ఏపీఏ తయారీకేంద్రం(సీటీవో-2)ను నవంబర్ 13 నుంచి 19 వరకు తనిఖీ చేశారు.