దేశంలో కీలక రంగాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక వృద్ధికి దోహదపడే అంశాల్లో నిస్తేజం కనిపిస్తున్నది.
అసలే అంతర్జాతీయంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ ప్రతికూల సంకేతాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయిప్పుడు. గడిచిన 4 నెలలుగా భారతీయ పారిశ్రామికోత్పత్తి సూచీ కదలికలు తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి.
అంతకంతకూ పతనమవుతున్న ఉత్పాదక వృద్ధి.. గత నెల జూన్లో 10 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 1.5 శాతానికి పరిమితమైంది. గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పత్తి నత్తనడకన సాగుతున్నదని తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తుండటం గమనార్హం.
న్యూఢిల్లీ, జూలై 28: దేశీయ పారిశ్రామిక రంగాన్ని నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది మొదలు పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తున్నది మరి. మార్చి నుంచి క్రమేణా పడిపోతున్న వృద్ధిరేటు.. గత నెల దాదాపు ఏడాది కనిష్ఠాన్ని తాకింది. జూన్లో 10 నెలల కనిష్ఠ స్థాయిని సూచిస్తూ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 1.5 శాతానికే పరిమితమైందని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో ఉత్పాదక వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక నిరుడు జూన్లో 4.9 శాతం వృద్ధిని ఐఐపీ చూపింది.
గనులు, విద్యుత్తు రంగాల్లో ఉత్పాదకత డీలా పడింది. అయితే దేశ ఆర్థిక ప్రగతికి రథ చక్రాలైన ఈ రెండు రంగాల్లో మందగమనం ఇలాగే కొనసాగితే.. మొత్తం జీడీపీ వృద్ధిని అది ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏడాది క్రిందటితో పోల్చితే ఈ జూన్లో గనుల రంగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఫలితంగా విద్యుదుత్పత్తిపై పెద్ద ఎత్తునే ప్రభావం పడింది. పోయినసారి జూన్లో దేశీయ విద్యుదుత్పత్తిలో 8.6 శాతం వృద్ధి నమోదైంది. కానీ ఈ జూన్లో 2.6 శాతంగానే ఉన్నది. ఇప్పటికీ దేశంలో విద్యుత్తు అవసరాలు అత్యధికంగా తీరేది బొగ్గు ద్వారానే. దీంతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి ప్రభావం.. వెంటనే విద్యుత్తు తయారీపై కనిపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కీలకమైన తయారీ రంగంలోనూ గత నెల వృద్ధిరేటు అంతంతమాత్రంగానే ఉన్నది. గత ఏడాది జూన్లో 3.5 శాతంగా నమోదవగా, ఈ జూన్లో అది 3.9 శాతానికి పెరిగిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తమ తాజా నివేదికలో వెల్లడించింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఐఐపీ వృద్ధి కేవలం 2 శాతంగానే ఉన్నది. ఏడాది క్రితం 5.4 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో 11 నెలల కనిష్ఠానికి దిగజారినైట్టెంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో 4 శాతంగా ఉన్నట్టు ఎన్ఎస్వో చెప్తున్నది. ఇదిలావుంటే ఈ ఏడాది మే నెలలో ఐఐపీ వృద్ధిరేటును ఎన్ఎస్వో సవరించింది. ముందుగా 1.2 శాతంగా ప్రకటించగా, దాన్నిప్పుడు 1.9 శాతానికి పెంచింది.