హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం సచివాలయంలో దుబాయి కేర్స్ సీఈవో వైస్ చైర్మన్ తారిఖ్ అల్ గర్గ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా రంగంలో మార్పులకోసం పనిచేస్తున్న దుబాయి కేర్స్ సంస్థ అధినేతను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని, పెట్టుబడులు పెట్టే సంస్థలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.
విద్యా వ్యవస్థ పురోగమనానికి తాము చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా శ్రీధర్ బాబుకు తారిఖ్ గర్గ్ వివరించారు. దేశాల్లో విద్యాభివృద్ధికి తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తున్నదని, మొద టి దశలో భాగంగా భారత్తో సహా 10 దేశా ల్లో విద్యారంగం పురోగమించడం కోసం గ్లోబల్ ఎడ్యుకేషన్ సొల్యుషన్స్ యాక్సిలరేటర్(జీఈఎస్ఈ)ను ప్రారంభించామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి సాధికారిత కల్పించడం తమ లక్ష్యమన్నారు.