న్యూఢిల్లీ, డిసెంబర్ 18: చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా బుధవారం మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ బోర్డు.. నిబంధనల్ని కఠినతరం చేసింది. ఐపీవో కోసం అనుమతి కోరుతూ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసేటప్పుడు చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రెండింటిలోనైనా నిర్వహణ లాభాలు కనీసం కోటి రూపాయలుండాల్సిందేనని ఎస్ఎంఈలకు సెబీ స్పష్టం చేసింది. అలాగే మదుపరుల ప్రయోజనార్థం డిబెంచర్ ట్రస్టీలు, ఈఎస్జీ రేటింగ్ ప్రొవైడర్లు, ఇన్విట్స్, రీట్స్, ఎస్ఎం రీట్స్లకు దన్నుగా పలు సంస్కరణలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఉన్న నిబంధనల్ని సెబీ సవరించింది. ఇందులో భాగంగానే ఓ కొత్త అసెట్ క్లాస్.. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను పరిచయం చేసింది. హై-రిస్క్ ప్రొఫైల్ ఉన్న ఇన్వెస్టర్ల కోసం దీన్ని తెచ్చింది. అలాగే ప్యాసీవ్లీ మేనేజ్డ్ స్కీముల కోసం లిబరలైజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్ లైట్) ఫ్రేమ్‌వర్క్‌నూ తీసుకొచ్చింది.