హైదరాబాద్, జనవరి 25 (బిజినెస్ బ్యూరో): రాష్ర్టానికి చెందిన ఔషధ దిగ్గజాల్లో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డాలర్ విలువ పెరగడం, నూతన ఔషధాల దన్నుతో గడిచిన త్రైమాసికానికిగాను రూ.1,247.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.706.5 కోట్ల లాభంతో పోలిస్తే 77 శాతం అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి పరాగ్ అగర్వాల్ మాట్లాడుతూ…గత త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన ఆదాయం 27 శాతం ఎగబాకి రూ.6,770 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు.
ఉత్తర అమెరికా నుంచి సంస్థకు రూ.3,060 కోట్ల ఆదాయం సమకూరింది. కొత్తగా ఐదు ఔషధాలను విడుదల చేయడం ఆదాయం పెరగడానికి దోహదపడింది. ఈ ఏడాది మొత్తంలో 25 ఔషధాలను విడుదలచేయాలనుకుంటున్నది.