న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలో కీలకమైన తయారీ రంగం డీలాపడింది. భారత ప్రగతికి అన్నివిధాల దన్నుగా ఉండే ఉత్పాదక రంగం నానాటికీ బలహీనపడుతుండటం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నది. గత నెల 3 నెలల కనిష్ఠాన్ని తాకింది. సోమవారం విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెలలో 57.6 స్థాయికి పరిమితమైంది మరి. అంతకుముందు నెల ఏప్రిల్లో ఇది 58.2గా ఉన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత సూచీ ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి.
ఇదీ సంగతి..
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మార్కెట్లో తగ్గిన డిమాండ్, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు.. పీఎంఐ వృద్ధిరేటును అడ్డుకున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ సంఘర్షణ, మార్కెట్లో పెరిగిన పోటీ వాతావరణం, విజృంభిస్తున్న ధరలు.. తయారీ రంగ కార్యకలాపాలకు ప్రధాన అవరోధంగా పరిణమించాయని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ ప్రంజుల్ భంగారీ చెప్తున్నారు. ఇక రవాణా, కార్మిక-కూలీల ఖర్చులు పెరిగిపోయాయని, దీంతో నిర్వహణ వ్యయాలు భారమైపోయాయని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులతో ఆయా ఉత్పత్తి ధరలూ పెరుగుతున్నాయని, దీంతో మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంటుందని, ఇది మళ్లీ ఉత్పత్తినే దెబ్బతీస్తున్నదని అంటున్నారు.