న్యూఢిల్లీ, నవంబర్ 7: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లన్నింటిని ఏకం చేసి ఒక్కటే పెట్టాలని ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ అన్నారు. అంతేగాక దేశంలో మినహాయింపులు లేని పన్ను విధానం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ జీడీపీలో కేంద్రం, రాష్ర్టాల పన్ను వసూళ్లు 15 శాతం మాత్రమేనని గుర్తుచేశారు. కానీ ప్రజా మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు.
ఈ క్రమంలోనే ఆయా వస్తూత్పత్తులు, సేవలకు వేర్వేరు పన్ను రేట్లుండరాదన్నారు. అయితే తన మాటల్ని పీఎంఈఏసీ సిఫార్సుగా మాత్రం అర్థం చేసుకోవద్దని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఈ సందర్భంగా దేబ్రాయ్ స్పష్టం చేశారు. నిజానికి జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ.. జీఎస్టీ రెవిన్యూ న్యూట్రల్ రేటు 17 శాతంగా ఉంటుందని అంచనా వేసిందని, కానీ ఇప్పుడు జీఎస్టీ సగటు రేటు 11.5 శాతంగానే ఉన్నట్టు చెప్పారు.
ఇక ప్రభుత్వం ఇస్తున్న మినహాయింపుల విలువ దేశ జీడీపీలో 5-5.5 శాతంగా ఉందని, ఈ స్థాయిలో మినహాయింపులు ఉండాలా? అన్న ప్రశ్న సైతం నేడు తలెత్తుతున్నదన్నారు. అందుకే వీటన్నింటికి బదులుగా ఓ సరళతరమైన పన్ను విధానం ఉంటే చాలని, అప్పుడు పన్ను ఎగవేతలు, పన్ను మినహాయింపులూ ఉండబోవని అభిప్రాయపడ్డారు. అలాగే కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయ పన్నుల మధ్య కృత్రిమ అంతరాలను తొలగించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు.