గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనే చవిచూశాయి. లోక్సభ ఎన్నికల భయాల నడుమ మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,449.08 పాయింట్లు క్షీణించి 73,961.31 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 426.40 పాయింట్లు పతనమై 22,530.70 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా సూచీలు నష్టాలనే మూటగట్టుకోవచ్చన్న అంచనాలున్నాయి. మంగళవారం ఎన్నికల ఫలితాలు రానుండటంతో ఒడిదొడుకులకూ వీలున్నదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం కూడా మార్కెట్లను నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 22,100 పాయింట్ల స్థాయి కీలకం. దీనికి దిగువన ముగిస్తే 21,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 23,000-23,200 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.