Donald Trump | ముంబై, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ పరస్పర సుంకాల సమరానికి కాలుదువ్వుతున్నట్టు సంకేతాలు రావడంతో మదుపరులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోగా.. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ రెండూ పెద్ద ఎత్తున క్షీణించాయి. సెన్సెక్స్ 824.29 పాయింట్లు లేదా 1.08 శాతం కోల్పోయి 76వేల స్థాయికి కింద 75,366.17 వద్ద ముగియగా, నిఫ్టీ 263.05 పాయింట్లు లేదా 1.14 శాతం పడిపోయి 23వేల స్థాయికి దిగువన 22,829.15 వద్ద స్థిరపడింది. దీంతో గత ఏడాది జూన్ నుంచి ఈ స్థాయిల్లోకి సూచీలు క్షీణించడం ఇదే తొలిసారైనైట్టెంది. ఒకానొక దశలోనైతే సెన్సెక్స్ 922.87, నిఫ్టీ 305.30 పాయింట్లు పతనమయ్యాయి.
9.28 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.9,28,229.09 కోట్లు హరించుకుపోయింది. చివరకు రూ.4,10,23,624.90 కోట్ల వద్ద ఆగింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 3.51 శాతం, మిడ్‌క్యాప్ 2.68 శాతం మేర నష్టపోయాయి. ఐటీ, టెక్నాలజీ, మెటల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్స్, చమురు-గ్యాస్ షేర్లు 3.31 శాతం నుంచి 2.41 శాతం వరకు నష్టపోయాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదలు బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద 32 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది.