Stock Market | ముంబై, ఫిబ్రవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా నష్టపోయాయి. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్‌పై 25 శాతం సుంకం విధిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లపై పిడుగుపడ్డట్టు అయింది. మదుపరుల్లో నమ్మకం సడలడంతో అమ్మకాల బటన్ నొక్కారు. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్, మెటల్, చమురు రంగ షేర్లు కుదేలవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది. ఇంట్రాడేలో 750 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 548 పాయింట్లు నష్టపోయి 77,311.80 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 178.35 పాయింట్లు కోల్పోయి 23,381.60 వద్ద స్థిరపడింది. అమెరికా టారిఫ్ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని, దేశీయ మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా పతనానికి పరోక్షంగా కారణమయ్యాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
టాప్ లూజర్‌గా పవర్‌గ్రిడ్
నిరుత్సాహాక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో పవర్‌గ్రిడ్ షేరు భారీగా పతనం చెందింది. ఒక దశలో నాలుగు శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 3.45 శాతం నష్టంతో రూ.268.70 వద్ద ముగిసింది. దీంతోపాటు టాటా స్టీల్, జొమాటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు కూడా రెండు శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. అలాగే మహీంద్రా, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి. వీటితోపాటు సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, నెస్లె, ఎస్బీఐ షేర్లు పతనం చెందాయి. కానీ, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 2.25 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.06 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ రంగ సూచీ అత్యధికంగా 2.69 శాతం నష్టపోగా, మెటల్ 2.63 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.61 శాతం, యుటిలిటీ 2.49 శాతం దిగువకు పడిపోయాయి.
నష్టాలకు కారణాలు ఇవే
నాలుగు రోజుల్లో 7.68 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద కరిగిపోతున్నది. ఎఫ్ఐఐలు పెట్టుబడులను వెనక్కి తీసు కుంటుండటం, కొత్తగా టారిఫ్ యుద్ధానికి ట్రంప్ తెరలేపడంతో గత నాలుగు సెషన్లలో మదుపరులు రూ.7.68 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో నమోదిత సంస్థల విలువ రూ.7,68, 252.32 కోట్లు కరిగిపోయి రూ.4,1 7,82,573.79 కోట్లకు చేరింది.