ముంబై, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన.. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగడం కూడా మదుపర్లను పెట్టుబడుల ఉపసంహరణలకు ఉసిగొల్పింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,677.12 పాయింట్లు లేదా 2.15 శాతం పతనమై 76,503.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,921.69 పాయింట్లు క్షీణించడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 516.65 పాయింట్లు లేదా 2.12 శాతం పడిపోయి 24వేల మార్కుకు దిగువన 23,882.05 దగ్గర నిలిచింది.
ఉదయం ఆరంభం నుంచే..
సూచీలు ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొన్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు, పరుగులు పెడుతున్న ముడి చమురు ధరల మధ్య సెన్సెక్స్ 534, నిఫ్టీ 164 పాయింట్లు పతనమయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు పెరుగుతూపోయాయి. ఇరాన్‌తో ఇక తాడోపేడో తేల్చుకోవడమే అన్న సంకేతాలు ట్రంప్ నుంచి రావడం.. క్రూడాయిల్ రేట్లను మరింత విజృంభించేలా చేసింది. దీంతో మదుపర్లు అమ్మకాలకు పెద్దపీట వేశారు. ఫలితంగా ఇండిగో, మారుతీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు సహా బీఎస్ఈ బ్లూచిప్ ఇండెక్స్ అయిన సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లూ నష్టాల్లోనే ముగియాల్సి వచ్చింది. అసలే ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాలున్నాయి. వీటికి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లోకి జారుకోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -ఈ ఒక్కరోజే అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీకి 2 శాతానికిపైగా నష్టాలు
హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకున్న మధ్యంతర శాంతి ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ముడి చమురు ధరలు సైతం ప్రతికూలంగా మారాయి. -పొన్ముడి ఆర్, ఎన్రిచ్ మనీ సీఈవో
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దిశగా నడుస్తున్నది. ఇవన్నీ కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియడం, ట్రంప్ భీకర దాడులు చేస్తామని చెప్పడం కూడా అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. -అంకుర్ పుంజ్, ఈక్విరస్ వెల్త్ ఎండీ
8.96 లక్షల కోట్లు మటాష్
స్టాక్ మార్కెట్లు భీకర నష్టాలపాలవడంతో బుధవారం ఒక్కరోజే మదుపర్ల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ సుమారు రూ.9 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. అమెరికా-ఇరాన్ వార్తో గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రూ.8.96 లక్షల కోట్లు పడిపోయి రూ.4,71,23,612.10 కోట్ల (4.95 ట్రిలియన్ డాలర్లు)కు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ పరిమితమైంది. వరుసగా 4 రోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడిన సంగతి విదితమే. బడా కార్పొరేట్లు ఈ ఏప్రిల్-జూన్‌లో ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండబోవన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. ఇప్పుడు ఈ భయాలకు పశ్చిమాసియా సంక్షోభం తోడైనైట్టెంది.