ముంబై, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌పడింది. ఐటీ, వాహన, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మంగళవారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 1,386 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 1,281.68 పాయింట్లు లేదా 1.55 శాతం నష్టపోయి 81,148.22 వద్ద ముగిసింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 25 సూచీలు నష్టపోగా, కేవలం ఐదు సూచీలు లాభాల్లో ముగిశాయి. మరోసూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 346.35 పాయింట్లు లేదా 1.39 శాతం కోల్పోయి 24,578.35 వద్ద స్థిరపడింది.
ఐటీ రంగ షేర్లు కుదేలయ్యాయి. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేరు 3.54 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. ఐటీతోపాటు ఎఫ్ఎంసీజీ, వాహన రంగ షేర్లలో అమ్మకాలు అత్యధికంగా జరగడం సూచీల పతనానికి కారణమని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఒకవైపు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయినప్పటికీ మరోవైపు రక్షణ రంగ షేర్లు కదంతొక్కుతున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం పది శాతానికి పైగా పెరిగాయి. దీంట్లో భారత్ డైనమిక్స్ షేరు అత్యధికంగా 11 శాతానికి పైగా లాభపడింది. యాక్సిస్కేడ్స్ టెక్నాలజీ 5 శాతం, డాటా ప్యాటర్న్ 4 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 4 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 3.81 శాతం, మిశ్రాధాతు నిగమ్ 3.44 శాతం, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ 2.84 శాతం, డీసీఎక్స్ సిస్టమ్స్ 2.81 శాతం చొప్పున పెరిగాయి. డ్రోన్ల తయారీ సంస్థ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 9.26 శాతం ఎగబాకింది.