ముంబై, ఫిబ్రవరి 2 : బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అండతోపాటు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో రివ్వున ఎగిశాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 81 వేల పాయింట్లను అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి 943.52 పాయింట్లు లేదా 1.17 శాతం అందుకొని 81,666.46 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ సైతం 25 వేల పాయింట్ల మైలురాయిని తిరిగి అందుకున్నది. 262.95 పాయింట్లు ఎగబాకి 25,088.40 వద్ద నిలిచింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం కలిసొచ్చిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో పవర్‌గ్రిడ్ షేరు 7.61 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు అదానీ పోర్ట్స్ 4.76 శాతం అధికమవగా, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టుబ్రో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు బలపడ్డాయి. కానీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ట్రెంట్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా యుటిలిటీ రంగ సూచీ అత్యధికంగా 2.66 శాతం బలపడగా, పవర్ 2.54 శాతం, సర్వీసెస్ 2.38 శాతం, ఎనర్జీ 1.98 శాతం, ఆటో 1.98 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.92 శాతం, మెటల్ 1.90 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు, ఐటీ, హెల్త్‌కేర్ రంగ షేర్లు మాత్రం పతనం చెందాయి.