ముంబై, జూన్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదరడం, చమురు ధరలు దిగిరావడంతో మదుపర్లలో ఉత్సాహం ఉరకలెత్తించింది. ఇరు దేశాల మధ్య మూడు నెలలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ఎట్టకేలకు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఈ జోష్ దేశీయ మార్కెట్లకు స్పష్టంగా కనిపించింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 1,300 పాయింట్ల వరకు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 736.38 పాయింట్లు అందుకొని 76,264.33 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు అందుకొని 23,853.90 వద్ద నిలిచింది. గత సెషన్లో సెన్సెక్స్ 1,695 పాయింట్లు లేదా 2.3 శాతం, నిఫ్టీ 461 పాయింట్లు లేదా 2 శాతం ఎగబాకిన విషయం తెలిసిందే.
చమురు, ఏవియేషన్స్ షేర్లలో ర్యాలీ
క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో చమురు కంపెనీల షేర్లతోపాటు విమానయాన, పెయింట్ తయారీ సంస్థల షేర్లు దూసుకుపోయాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన హెచ్‌పీసీఎల్ షేరు అత్యధికంగా 3.36 శాతం బలపడగా, బీపీసీఎల్ 2.71 శాతం, ఐవోసీ 2.48 శాతం బలపడ్డాయి. వీటితోపాటు స్పైస్‌జెట్ షేరు 6.72 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలువగా..ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 3.59 శాతం అందుకున్నది. అలాగే పెయింట్స్ తయారీ సంస్థలైన జేఎస్‌డబ్ల్యూ డ్యూలెక్స్ 2.15 శాతం, ఇండిగో పెయింట్స్ 1.30 శాతం, శాలిమార్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, కన్సాయి నెరోలాక్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. వీటితోపాటు ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, మారుతి షేర్లు కూడా బలపడ్డాయి. కానీ, ఎన్టీపీసీ 1.64 శాతం నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు కూడా పతనం చెందాయి. రంగాలవారీగా రియల్టీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఇండస్ట్రియల్స్, సర్వీసెస్ పుంజుకున్నాయి.
18 లక్షల కోట్లు పెరిగిన సంపద
గత రెండు సెషన్లలో మదుపర్ల సంపద రూ.18 లక్షల కోట్లకు పైగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, ఇంధన ధరలు దిగిరావడంతో ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్ మెరుగుపడింది. దీంతో గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,431.78 పాయింట్లు లేదా 3.29 శాతం, నిఫ్టీ 692.3 పాయింట్లు లేదా 2.98 శాతం బలపడ్డాయి. ఫలితంగానే బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18,15,339 కోట్లు ఎగబాకి రూ.4,70,49,119.48 కోట్లకు చేరుకున్నది.