ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయిల్, ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున లభించిన మద్దతు.. సూచీలను పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,041. 08 పాయింట్లు లేదా 1.9 శాతం ఎగబాకి నాలుగు వారాల గరిష్ఠాన్ని తాకుతూ 55,925.74 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 26 లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఒకానొక దశలో 1,197.99 పాయింట్లు ఎగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 308.95 పాయింట్లు లేదా 1.89 శాతం పుంజుకున్నది. దీంతో దాదాపు నాలుగు వారాల గరిష్ఠాన్ని నెలకొల్పుతూ 16,661.4 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 షేర్లలో 45 లాభాలను పొందాయి.
గత గురు, శుక్రవారాల్లో మార్కెట్లు లాభాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో సోమవారం కూడా ఈ ర్యాలీ కొనసాగినైట్టెంది. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ 2,176, నిఫ్టీ 635 పాయింట్లు పెరిగాయి. ఈసారి రుతుపవనాలు కేరళకు ముందుగానే వస్తాయన్న అంచనాలు, తొలగిపోతున్న ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కాస్త వెనక్కి తగ్గడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన షేర్లతోపాటు మధ్య, చిన్నస్థాయి షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 2.28 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 2.23 శాతం పెరిగాయి. రంగాలవారీగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 4.41 శాతం, రియల్టీ 3.96 శాతం, ఐటీ 3.75 శాతం, టెక్నాలజీ 3.53 శాతం, ఎనర్జీ షేర్లు 2.72 శాతం చొప్పున బలపడ్డాయి. ఇక సెన్సెక్స్ షేర్లలో టైటాన్ అత్యధికంగా 4.94 శాతం పెరిగింది. ఆ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా 4.69 శాతం, ఇన్ఫోసిస్ 4.57 శాతం, టీసీఎస్ 3.47, రిలయన్స్ 3.44 శాతం శాతం పుంజుకున్నాయి. ఎల్అండ్టీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఎయిర్టెల్ షేర్లూ లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లలో ప్రధానమైన దక్షిణ కొరియా, చైనా, జపాన్, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది. షాంఘై, బీజింగ్‌లలో వ్యాపార కార్యకలాపాలపై విధించిన ఆంక్షలు తొలగిపోతుండటం మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించింది. ఐరోపా మార్కెట్లలోనూ జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజులు లాభాల్లో ముగిసిన నేపథ్యంలో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లకుపైగా పెరిగింది. రూ.258.48 లక్షల కోట్లకు చేరింది. ఈ నెల 25న మార్కెట్లు ముగిసే సమయానికి ఇది రూ.248.27 లక్షల కోట్లుగా ఉన్నది. ఈ మూడు రోజుల్లో ఒక్క సెన్సెక్స్ సూచీనే సుమారు 2,176.48 పాయింట్లు పుంజుకున్నది. దీంతో మదుపరుల సంపద సైతం రూ.10,19,936.84 కోట్లు ఎగిసి రూ.2,58,47,092.4 కోట్లకు చేరింది.