ముంబై, అక్టోబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు మదుపరులను ఆకట్టుకోవడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 591.69 పాయింట్లు లేదా 0.73 శాతం ఎగిసి 81,973.05 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 690.81 పాయింట్లు పుంజుకున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా163.70 పాయింట్లు లేదా 0.66 శాతం ఎగబాకి 25,127.95 వద్ద నిలిచింది. టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.1.35 లక్షల కోట్లు పెరిగి రూ.4,63,62,781.71 కోట్లను తాకింది.
డీమార్ట్ షేర్లు ఢమాల్
ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో రిటైల్ దిగ్గజం డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో 8.48 శాతం పడిపోయి రూ.4,184.45 వద్ద, ఎన్ఎస్ఈలో 8.35 శాతం క్షీణించి రూ.4,191 వద్ద నిలిచాయి.