Market Pulse | ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం బయటపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,395.94 పాయింట్లు ఎగబాకి 78,553.20 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 1,023.10 పాయింట్లు ఎగిసి 23,851.65 దగ్గర ముగిసింది. ఇక ఈ వారం విషయానికొస్తే.. జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై సూచీల కదలికలు ఆధారపడి ఉండనున్నాయి.
ఇప్పటికే ప్రధాన ఐటీ రంగ కంపెనీల ఫలితాలు వచ్చేయగా.. మార్కెట్లపై ఆ మేరకు ప్రభావం కనిపించింది. కాబట్టి ఆయా బడా సంస్థలు ఆకర్షణీయ లాభాలను చూపితే మార్కెట్లు పరుగులు పెడుతాయనే చెప్పవచ్చు. లేకపోతే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉన్నది.
కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మా ట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,400-24,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.