ముంబై, ఆగస్టు 27: దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి పదిహేను నిమిషాల్లో అమ్మకాలు పోటెత్తడంతో వరుసగా రెండోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రెండు శాతం వరకు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది. వీటికి తోడు అంతర్జాతీయంగా నిరంతర భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 539.35 పాయింట్లు నష్టపోయి 76,933.59 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 116.90 పాయింట్లు కోల్పోయి 24,090.85 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు మళ్లీ పుంజుకోవడం, నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగియడం కూడా మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్ల పతనాన్ని శాసించాయన్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు యథాతథంగా నడుస్తున్న సూచీలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పిడుగుపడ్డట్టు అయింది. అమెరికాలో క్లాస్-యాక్షన్ దావా వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక ప్రతికూల అంశాల్లో ఒకటిగా మారనున్నదని ఫెడరల్ చైర్మన్ కెవిన్ వార్ష్ వ్యాఖ్యలు మదుపర్లు ఒక్కసారిగా అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా చివరి పావుగంటలో సూచీలు భారీగా నష్టపోయాయి. సూచీల్లో మెజారిటీ వాటా కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రెండు శాతానికి పైగా పతనం చెందడం ప్రధాన కారణమని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.