ముంబై, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. వీటికి తోడు బ్లూచిప్ సంస్థల షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడం కూడా పతనానికి ఆజ్యంపోసింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 238.41 పాయింట్లు కోల్పోయి 77,470.11 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.80 పాయింట్లు పతనం చెంది 24,187.70 వద్ద స్థిరపడింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, మరోవైపు విదేశీ పెట్టుబడులు తరలిపోవడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
బ్లూచిప్ సంస్థల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రెండు శాతం వరకు నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.48 శాతం, ఎస్బీఐ 1.48 శాతం, టీసీఎస్ 1.32 శాతం, ఇన్ఫోసిస్ 1.24 శాతం, ట్రెంట్ 1.1 శాతం చొప్పున పతనం చెందాయి. మరోవైపు, బజాజ్ ఫిన్సర్వ్ షేరు 2 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫోకస్డ్ ఐటీ, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ షేర్లు నష్టపోయాయి.