సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు నగరంలో వరుస దొంగతనాలు, భారీ చోరీలు జరుగుతుండగా పోలీసులు మాత్రం బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టుపై దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో శాంతిభద్రతలు కరువై ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్ష సాధింపులపై దృష్టి పెడుతున్నది. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే ఖాకీలు మాత్రం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తూ తెల్లవారుజామునే కునుకు లేకుండా పని చేస్తున్నారు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు నేరాల కట్టడి కన్నా..ప్రతిపక్ష నేతలే టార్గెట్!
అధికారపార్టీ నేతల సేవలో తరిస్తూ ప్రజల రక్షణను గాలికొదిలేశారని నగరవాసులు మండిపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల్లో మూడు భారీ చోరీలతో సహా ప్రతీరోజూ ఎక్కడో అక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా పోలీసుల దృష్టి మాత్రం బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా మందీమార్బలంతో వారి ఇళ్ల వద్ద కాపు కాస్తూ అరెస్టులు చేసేందుకు హడావిడి చేస్తూ ప్రజారక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించాల్సిన తమ సమయాన్ని, విపక్ష నేతల అరెస్టుల కోసం వినియోగించడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
హైదరాబాద్ నగర శివార్ల నుంచి పాతబస్తీ వరకు వరుస దొంగతనాలు, దోపిడీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మేడిపల్లి, శంషాబాద్, బేగంబజార్ ప్రాంతాల్లో మూడు భారీ ఘటనలు వెలుగుచూశాయి. మూడు కేసుల్లోనూ నిందితులు పక్కాప్లాన్‌తో రంగంలోకి దిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం అర్ధరాత్రి మేడిపల్లి పరిధిలోని క్యారెట్ లేన్ జువెలరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.2కోట్ల విలువైన ఆభరణాలు, డైమండ్ నగలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెప్పారు. ఇది రాజస్థానీ దొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. దొంగలు గ్యాస్కట్టర్లను ఉపయోగించి ఏటీఎం మిషన్‌ను కట్‌చేసి రూ.30లక్షల నగదును ఎత్తుకెళ్లారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రెం డు భారీ దొంగతనాలు జరగడంతో నగర ప్రజలు, వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బేగంబజార్‌లో అజీజ్ప్లాజా సమీపంలో వాచ్ వ్యాపారి వద్ద రూ.9.5లక్షల నగదును దుండగుడు దోచుకెళ్లాడు. గతవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి పెద్ద అంబర్‌పేటలోని గేటెడ్ కమ్యూనిటీలో రెండు ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. కేవలం గంటల వ్యవధిలో భారీ చోరీలు జరగడం, సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసుల నిఘావైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
నగర పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తూ కమిషనరేట్ల సంఖ్యను పెంచి, నేరాల అదుపు, ప్రజల భద్రతకు ఠాణాలు, జోన్లు, డివిజన్ల సంఖ్యను పెంచినా ప్రజల ఆస్తులు, ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. దీనికి కారణం నగర పోలీసుల తీరేనంటూ ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నాయి. విధుతు సక్రమంగా నిర్వహించకుండా ఎంతసేపు ప్రతిపక్షపార్టీ నేతలే టార్గెట్‌గా వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారు తప్ప భాగ్యనగరంలో శాంతిభద్రతలపై దృష్టిపెట్టడం లేదని నగరవాసులు అంటున్నారు. క్రిశాంక్ అరెస్టు వ్యవహారంతో ఈ అంశం తేటతెల్లమైంది.
ఒకవైపు మల్కాజిగిరిలోనే భారీచోరీలు, హత్యలు జరుగుతూ నేరాలకు అడ్డాగా మారుతున్న క్రమంలో ఆ కమిషనరేట్ పరిధిలోనే నివాసముంటున్న క్రిశాంక్ ఇంటివద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడం, అతనిని అరెస్టు చేసే క్రమంలో నాటకీయ పరిణామాలు.. అంతా హడావిడితో పోలీసులు చేసిన హంగామా విమర్శలకు దారితీసింది.
క్రిశాంక్‌పై ఫిర్యాదు రాగానే అతనిని అరెస్టు చేయాలనే లక్ష్యంతోనే పోలీసులు పనిచేస్తున్నారని, అధికారపార్టీ నేతల ఆగడాలను, అవినీతిని ఎప్పటికప్పుడు క్రిశాంక్ ఎండగడుతున్నందుకే పోలీసులను ఉపయోగించి రేవంత్ సర్కారు ఈ రకమైన ఆగడాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత వారంరోజులుగా జరుగుతున్న నేరాల నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులు క్రిశాంక్ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆయనను అరెస్టు చేసేందుకు భారీగా బలగాలను మోహరించడం ఏ రకమైన సంకేతాన్నిస్తుందో అర్థమవుతుందని ప్రతిపక్షపార్టీలు అంటున్నాయి.