కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నది. హైడ్రా పేరిట ప్రజల ఇండ్లను కూలగొడుతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం, ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట భూ ములను అన్యాయంగా గుంజుకునేందుకు అధికారులను పంపుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. కరెంటు కోతలు, తాగునీటి సమస్య, సంక్షేమ పథకాల్లో కోత ఇలా చెప్పుకుటూ పోతే ప్రభుత్వం చేతకాని తనం వల్ల సకలం సమస్యల వలయంగా మారిపోతున్నది. ప్రజల భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టుడు ఇన్నేండ్ల నుంచి ఏ ప్రభుత్వంలో చూడలేదు. ఈ రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా తుగ్లక్ పాలన సాగిస్తున్నారు. భూదందాలు, దోపిడీలు, అక్రమాలకు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి అష్టకష్టాలు పడుతున్నాం.. ఇంకో రెండేండ్లు ఆ బాధ అనుభవిస్తాం.. ఆ తర్వాత కాంగ్రెస్‌ను బొందపెడతాం’ ఇదీ.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న బాధితుల ఆవేదన.
– సిటీ బ్యూరో,అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)/ బండ్లగూడ
సిటీ బ్యూరో, బండ్లగూడ, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ద్వారా ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రకటనలు, నోటీసులు, నోటిఫికేషన్లు ఇస్తుంది కానీ.. ఇప్పటి వరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఎందుకు ప్రజల ముందు ఉంచడం లేదని బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. రాజేంద్రనగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మూసీ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భూములు ఇచ్చేందుకు తొందరగా అంగీకరిస్తే వారం రోజుల్లో పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ ప్రకటించారు. దీంతో బాధితులంతా ఒక్కసారిగా కలెక్టర్‌పై మాటలతో విరుచుకుపడ్డారు. డీపీఆర్ బయట పెట్టకుండా ఏ ప్రాతిపదికన పరిహారం ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట భూదందాకు తెర తీసిందని ఆరోపించారు. రెండేండ్లలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెడ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహావేశాలకు లోనైన బాధితులు కలెక్టర్ ముందే ‘రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. కాంగ్రెస్ సర్కార్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
బాధితుల ఆందోళన మధ్యనే కలెక్టర్ పరిహారం గురించి వివరించారు. దానికి అంగీకరిస్తే వారం రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. దీనిపై అభిప్రాయాలు తెలపాలని బాధితులను కోరారు. మొదట భూమిని ఎందుకు సేకరిస్తున్నారో స్పష్టంగా చెప్పాలి. మూసీ ప్రాజెక్టుపై కనీసం సీఎంకు అయినా అవగాహన ఉందా? అని బాధితులు ప్రశ్నించారు. బఫర్ జోన్ దాటి ఉన్న భూమిని కూడా ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. భూమికి బదులు భూమి కావాలని, లేదంటే తమ స్థలాలను వేలం వేసి వచ్చిన డబ్బులను తమకు ఇవ్వాలని కోరారు. ల్యాండ్ సేకరణ చట్టం ద్వారా తాము భూమి సేకరిస్తున్నామని, దాని ప్రకారమే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
భూమికి భూమి ఇవ్వడం కుదరదని.. ప్రభుత్వ భూములు ఎక్కడా లేవని తెలిపారు. దీంతో హిమాయత్‌సాగర్ మాజీ సర్పంచి ఆంజనేయులు, మాజీ కార్పొరేటర్ అస్లాంబిన్ కలగజేసుకుని గండిపేట మండల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. తాము చూపిస్తామని అన్నారు. దీంతో విసిగిపోయిన కలెక్టర్ అక్కడి నుంచి ఆర్డీవో చాంబర్లోకి వెళ్లారు. దీంతో బాధితులు ఆర్డీవో చాంబర్ వద్దకు వెళ్లి ‘కలెక్టర్ డౌన్ డౌన్’ అంటూ నిరసన తెలిపారు. వెంటనే ఆర్డీవో శ్రీధర్ బయటకు వచ్చి వారికి నచ్చ చేప్పేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెనుదిరిగారు.
ప్రభుత్వం మూసీ అభివృద్ధి పేరుతో అవసరం లేకున్నా మా భూములను లాక్కుని దందాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. మా భూములు తీసుకుంటే అందుకు సమాన విలువైన భూమిని ఇస్తేనే అంగీకరిస్తాం. అది కూడా గండిపేట మండలం పరిధిలోనే ఇవ్వాలి. లేదంటే మా భూముల్లోకి ఎవరొచ్చినా అడ్డుకుంటాం. ప్రజల భూములు లాక్కొని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్ర చేస్తున్నది. ప్రభుత్వం కుట్రలు తిప్పికొడతాం. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అడ్డుకుని తగిన బుద్ధి చెప్తాం.
– విజయ్ భాస్కర్, మూసీ బాధితుడు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ప్రారం భం కానియ్యం. భవిష్యత్తు ప్ర ణాళిక రూపొందించుకుని నిరసనలు, ధర్నాలు చేపడతాం. ప్రాజెక్టును ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా నిరసనలు కొనసాగిస్తాం. మూసీ కాలుష్యాన్ని నియంత్రించి ప్రక్షాళన చేయమని కోర్టు చెబితే.. ప్రభుత్వం మాత్రం ప్రజల భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నది. మురుగు నీటి శుద్ధికి ఎస్టీపీలను ఏర్పాటు చేసుకోవాలి. కానీ భూములు కావాలంటే ఇచ్చేది లేదు.
– సుమ్రీత్, బాధితుడు