హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బొగ్గు గని తవ్వకాల కోసం ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలోని చారిత్రక రామప్ప ఆలయానికి ముప్పు తేవొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వెంకటాపూర్ వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీఎన్ఆర్ (పీవీఎన్ఆర్) ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాలని ఆయ న కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు గని ప్రాజెక్టుతో తెలంగాణకే గర్వకారణమైన యునెసో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయం, రామప్ప చెరువు, కాకతీయుల ప్రాచీన సాగునీటి వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
19 ఏండ్లకు సరిపడే బొగ్గు కోసం 800 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన రామప్ప వారసత్వాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పారు. బొగ్గును మరో ప్రాంతంలో తవ్వుకునే అవకాశం ఉన్నదని, కానీ రామప్పకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టంచేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సమర్పించిన నివేదికలో ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ గని సుమారు 300 మీటర్ల లోతు వరకు ఉండే అవకాశం ఉన్నదని పేరొన్నట్టు చెప్పారు.
ఈ గని రామప్ప ఆలయం, రామప్ప చెరువుకు సుమారు ఐదు కిలోమీటర్ల దిగువన ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామప్పకు సమీపంలో 300 మీటర్ల లోతైన గనిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. గనుల తవ్వకాల వల్ల ఏర్పడే పేలుళ్లు, పునరావృత భూకంపనాలు, భౌగోళిక మార్పులు ఆలయంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నదని చెప్పారు.
ఒకవైపు రామప్ప వారసత్వ పరిధిని, దాని జలవనరుల వ్యవస్థను రక్షించేందుకు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు అదే ప్రాంతానికి సమీపంలో భారీ ఓపెన్ కాస్ట్ గనిని ప్రతిపాదించడం పరస్పర విరుద్ధమైన చర్య అని వినోద్‌కుమార్ విమర్శించారు. పూర్తిస్థాయి శాస్త్రీయ, పర్యావరణ, వారసత్వ అధ్యయనాలు లేకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కోరారు.
అభివృద్ధి పేరుతో యునెసో ప్రపంచ వారసత్వ ప్రాంతాన్ని, కాకతీయుల జల వారసత్వాన్ని ప్రమాదంలోకి నెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ఓపెన్ కాస్ట్ గని ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలని, ప్రాజెక్టుకు ఎలాంటి ఎన్వోసీ, అనుమతి లేదా క్లియరెన్స్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యుడు కల్యాణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.