ముంబై, మే 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా మూడు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా తోడవడం సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 82 వేల మార్క్‌ను అధిగమించింది. చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం భారీ లాభాలను నిలుపుకోలేక పోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 410.19 పాయింట్లు అందుకొని 81,596.63 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 129.55 పాయింట్లు ఎగబాకి 24,813.45 వద్ద స్థిరపడింది. సూచీలు తిరిగి లాభాల్లోకి రావడంతో రూ.4 లక్షల కోట్ల మదుపరుల సంపద పెరిగింది.
అత్యధికంగా లాభపడిన సంస్థల షేర్లలో టాటా స్టీల్ ముందువరుసలో నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, నెస్లె, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్, ఎన్టీపీసీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే హెచ్‌యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, అదానీపోర్ట్స్, టైటాన్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్, మారుతి షేర్లు నష్టపోయాయి.
వచ్చే ఏడాది జూన్ నాటికి సెన్సెక్స్ 89 వేల పాయింట్లకు చేరుకునే అవకాశాలున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనావేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న 81,600 పాయింట్లతో పోలిస్తే ఎనిమిది శాతం వృద్ధిని కనబరచనున్నదని పేర్కొంది.