ముంబై, అక్టోబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రైవేట్ బ్యాంకులు, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం సూచీలను గట్టిగానే ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 465.75 పాయింట్లు లేదా 0.55 శాతం కోల్పోయి 84వేల మార్కుకు దిగువన 83,938.71 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే 498.8 పాయింట్లు పడిపోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 155.75 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 25,722.10 వద్ద ముగిసింది. గురువారం కూడా సూచీలు భారీగానే పతనమైన సంగతి విదితమే.
ఈ క్రమంలో ఈ వారం మొత్తంగా చూసినైట్టెతే సెన్సెక్స్ 273.17 పాయింట్లు, నిఫ్టీ 73.05 పాయింట్లు తగ్గుముఖం పట్టినైట్టెంది. ఇదిలావుంటే సెన్సెక్స్ షేర్లలో ఎటర్నల్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. విదేశీ మదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకుండా ఉండటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో.. చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
దేశంలోని విదేశీ మారకపు నిల్వలు తరిగిపోతున్నాయి. అక్టోబర్ 24తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు 6.925 బిలియన్ డాలర్లు దిగజారి 695.355 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నిజానికి అంతకుముందు వారం 4.496 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డును సమీపిస్తూ 702.28 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే అమెరికా వాణిజ్య సుంకాల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతూపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కూడా ఫారెక్స్ రిజర్వులకు గండి కొట్టిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాజా గణాంకాలనుబట్టి విదేశీ కరెన్సీ ఆస్తులు 3.862 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో వీటి వాటానే అధికం. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఇప్పుడివి 566.548 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గోల్డ్ రిజర్వులు కూడా 3.01 డాలర్లు దిగి 105.536 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.