ముంబై, జనవరి 7: దేశీయ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, మరోసారి అమెరికా టారిఫ్‌లను పెంచే అవకాశం ఉండటంతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది. దీంతో వరుసగా మూడోరోజూ బుధవారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం పతనానికి ఆజ్యంపోసింది.
ఇంట్రాడేలో భారీగా నష్టపోయిన సూచీలకు పలు బ్లూచిప్ షేర్ల నుంచి లభించిన మద్దతుతో చివరకు నష్టాలను తగ్గించుకోగిలింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 102.20 పాయింట్లు కోల్పోయి 85 వేల పాయింట్ల దిగువకు 84,961.14 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 37.95 పాయింట్లు పతనం చెంది 26,140.75 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండటం సూచీల్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
సూచీల్లో మారుతి, పవర్‌గ్రిడ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోగా..కానీ, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, వాహన, టెలికాం, రియల్టీ రంగ షేర్లు నష్టపోగా..ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు లాభపడ్డాయి.
ప్రస్తుతేడాది చివరినాటికి సెన్సెక్స్ 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లయింట్ అసోసియేట్స్ అంచనావేస్తున్నది. ప్రస్తుతం 84,805 పాయింట్ల స్థాయిలో కదలాడుతున్న సూచీ 11 శాతం వృద్ధితో ఈ మైలురాయికి చేరుకోనున్నదని తెలిపింది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లించే అవకాశం ఉండటంతో ఈ ఏడాది సూచీ రెండంకెల వృద్ధిని సాధించనున్నదని వెల్లడించింది. డాలర్ బలహీనంగా ఉండటం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 2025లో విలువైన లోహాలు భారీగా పెరిగాయి.