IT Companies | న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : దేశీయ ఐటీ రంగ సంస్థలు రూటు మార్చాయి. ఇన్నాళ్లూ మధ్య, ఉన్నతస్థాయి ఉద్యోగుల నియామకాలపై దృష్టి సారించిన కంపెనీలు.. ఇప్పుడు జూనియర్లకు పెద్దపీట వేస్తున్నాయి. మిడ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల స్థానంలో కొత్తవారిని తీసుకొస్తున్నాయి. అనుభవం ఉన్నవారిని ఎక్కువ జీతాలిచ్చి పెట్టుకోవడం కంటే.. ఫ్రెషర్లను తీసుకొని, వారిలో నైపుణ్యం పెంచేందుకు ఖర్చు పెట్టడమే లాభసాటి అని మెజారిటీ కంపెనీలు భావిస్తున్నాయి మరి. ఉద్యోగులపై పెట్టే వ్యయంలో నైపుణ్యాభివృద్ధికి చేసే ఖర్చు 5-7 శాతంగానే ఉంటున్నది. దీంతో తక్కువ జీతాల్లో జూనియర్ల నియామకాలే ఉత్తమం అన్న భావన యాజమాన్యాల్లో పెరిగిపోతున్నది.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ), దేశంలోని బహుళజాతి ఐటీ కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అయినప్పటికీ స్థానిక ఐటీ సంస్థలు మాత్రం పొదుపు మంత్రాన్నే జపిస్తుండటం ఇప్పుడు జాబ్ మార్కెట్లో మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. కాగా, భారతీయ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల్లో ఎక్కువ మొత్తం పోతున్నది ఉద్యోగుల జీతాలకే. ఈ క్రమంలోనే వేతన భారాన్ని తగ్గిస్తే సంస్థ లాభాలు పెరుగుతాయన్న ఆలోచనతో జూనియర్ల వైపు చూస్తున్నాయిప్పుడు చాలా కంపెనీలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఫలితాలనుబట్టి ఉద్యోగుల జీతాల ఖర్చును ఇప్పటికే ప్రధాన సంస్థలు తగ్గించేసుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఇందుకు నిదర్శనం.
కంపెనీల వైఖరి.. ప్రస్తుతం దేశీయ ఐటీ రంగంలో నెలకొన్న మందగమనాన్ని సూచిస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మున్ముందూ ఐటీ రంగంలో పెద్దగా ఉద్యోగ నియామకాలు ఉండకపోవచ్చని, ఉన్నా.. అరకొర జీతాలకు ఫ్రెషర్లనే తీసుకుంటారని వారు చెప్తున్నారు. నిజానికి భారతీయ ఐటీ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికానే. అగ్రరాజ్యంలో అంతా బాగుంటేనే కొత్త కొలువులకు వీలుంటుంది. అయితే అమెరికా ఎన్నికలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఐరోపా దేశాల్లో క్రిస్మస్, న్యూఇయర్ హాలీడే వాతావరణంతోనూ మార్కెట్ స్తబ్ధత చోటుచేసుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు చక్కబడితే నియామకాల్లో జోరు పెరుగుతుందన్న అంచనాలూ ఉన్నాయి.
10 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగుల స్థానంలో 3-5 ఏండ్ల అనుభవం కలిగిన ఇద్దరు, ముగ్గురు జూనియర్ ఉద్యోగులను నియమించుకొనేందుకే ఇప్పుడు ఐటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ ఒక్కరికిచ్చే జీతం కంటే ఈ ఇద్దరు, ముగ్గురికిచ్చేదే తక్కువగా ఉంటున్నది. దీనివల్ల వేతన భారం కంపెనీలపై తగ్గుతున్నది. మొత్తంగా చూసినైట్టెతే నియామకాల ప్రక్రియ నెమ్మదించింది. దేశీయ ఐటీ రంగంపై అమెరికా ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
రాబోయే త్రైమాసికాల్లోనూ దేశీయ ఐటీ రంగంలో నియామకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చు. జీతాల పెంపు, పదోన్నతులు, ప్రోత్సాహకాలు.. ఐటీ కంపెనీల ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఇక అట్రిషన్ రేటు పెరగడం వెనుక జీసీసీల నుంచి ఐటీ ఉద్యోగులకు పెరుగుతున్న డిమాండ్, వెళ్లిపోతున్న ఉద్యోగులను ఆపేందుకు ఐటీ సంస్థలు పెద్దగా ప్రయత్నించకపోవడం కారణాలుగా నిలుస్తున్నాయి.