న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాయి. ఇప్పటికే నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్న సంస్థలు ..తాజా ఉద్యోగ నియామకాలకు బ్రేక్‌వేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన తొమ్మిది నెలల్లో దేశీయ ఐటీ దిగ్గజాలు నికరంగా 17 మందిని మాత్రమే రిక్రూట్ చేసుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఐటీ సంస్థలు 17,764 మందిని నియమించుకున్నాయి. టెక్నాలజీ రంగం రూపాంతరం చెందుతున్నదని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు అనుసంధానం అధికం కావడం ఇందుకు కారణమని తెలిపింది.
దీంతో టీసీఎస్ ఏకంగా 25 వేల మంది సిబ్బందిని తొలగించింది. సాంప్రదాయక వృద్ధికి దూరంగా అడుగులు వేస్తున్న ఐటీ సంస్థలు…ఉత్పాదకతను పెంచుకోవడానికి పలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు టాప్-5 సంస్థలు కేవలం 17 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. భవిష్యత్తులో నియామకాలు ఉండకపోవచ్చని హెచ్చరించాయి కూడా. మరోవైపు, ఐటీ రంగంలో సంస్థలు విలీనాలు అధికంగా జరగడం కూడా నియమాకాలు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది.
ప్రధానంగా గణాంకాలు తాత్కాలిక మందగమనాన్ని కాకుండా నిర్మాణాత్మక మార్పును సూచిస్తున్నాయని అమెరికాకు చెందిన హెచ్‌ఎఫ్‌ఆర్ రిసెర్చ్ సీఈవో ఫిల్ ఫర్షేట్ తెలిపారు. ఐటీ సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని, క్లయింట్లు కూడా తమ ప్రొడక్ట్‌ను పెంచుకోవడానికి చూస్తున్నాయన్నారు. మరోవైపు, ఏఐ, ఆటోమేషన్‌కు విసృతంగా డిమాండ్ నెలకొనడం కూడా రిక్రూట్ మెంట్లను తగ్గించుకోవడానికి ప్రధాన కారణమన్నారు. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్ల కంటే అధికంగా వెచ్చిస్తున్న సంస్థ..దీంట్లో నాలుగో వంతు కూడా డిజిటల్ కోసం ఖర్చు కాకపోవడంతో సంస్థలు వీటి వైపు మొగ్గుచూపుతున్నాయన్నారు.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం విప్రో..ఉద్యోగ నియామకాలను తగ్గించుకునేయోచనలో ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతంలో 12 వేల మందిని ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించిన సంస్థ..ఈసారి దీనిని 8 వేలకు కుదించింది. మూడో త్రైమాసికంలో కేవలం 400 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నది. ఈ సారి క్యాంపస్‌ల నుంచి రిక్రూట్మెంట్లను నిలిపివేసినట్టు విప్రో హెచ్‌ఆర్‌వో సౌరభ్ గోవిల్ తెలిపారు. మూడో త్రైమాసికంలో వృద్ధి మందగించినప్పటికీ ప్రస్తుత త్రైమాసికంలో ఐదు వేల మందికి పైగా నియామకాలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.
నియామకాల దృక్కోణం నుంచి, ముఖ్యంగా క్యాంపస్‌లలో రిక్రూట్మెంట్ కోసం పలు యూనివర్సిటీల్లో 50కి పైగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో ఆయా విశ్వవిద్యాలయాల్లో పని చేయడానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పినట్టు చెప్పారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డాటా వర్క్ విభాగాలపై మంచిపట్టున్న ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు తెలిపారు.