పారిశ్రామిక ప్రగతి ప్రతికూలానికి పడిపోవడం ఇది తాత్కాలికమే. గనులు, విద్యుత్, రిటైల్ రంగాల్లో నెలకొన్న మందకొడి పరిస్థితుల కారణంగానే ఆగస్టులో ఐఐపీ గణాంకాలు మైనస్‌లోకి జారుకున్నాయి. అత్యధిక వర్షాలు కురియడం కూడా ఉత్పత్తి రంగంపై పడింది. అయినా ప్రస్తుత నెలలో పారిశ్రామిక రంగం మళ్లీ పుంజుకొని 3-5 శాతం మధ్యలో వృద్ధిని సాధించవచ్చు.
– అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశీయ పారిశ్రామిక రంగం పడకేసింది. నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మోదీ చెబుతున్న మాటలకు, గణాంకాలకు పొంతనే లేకుండా పోతున్నది. మొన్నటికి మొన్న కీలక రంగాలు పాతాళంలోకి పడిపోగా..ఇప్పుడు పారిశ్రామిక రంగ సూచీలు అట్టడుకు పడిపోయింది.
ఆగస్టు నెలకుగాను పారిశ్రామిక గణాంకాలు మైనస్ 0.1 శాతానికి జారుకున్నది. రెండేండ్ల తర్వాత ప్రతికూలానికి పడిపోవడం ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. గనులు, విద్యుత్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతోపాటు తయారీ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉండటం పారిశ్రామిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపాయని కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం విడుదల నివేదికలో వెల్లడించింది. మరోవైపు, జూలై పారిశ్రామిక ప్రగతి గణాంకాలను 4.8 శాతానికి బదులు 4.7 శాతానికి తగ్గించింది.
టాప్‌గేర్‌లో దూసుకుపోయిన పారిశ్రామిక రంగానికి బ్రేక్‌లు పడ్డాయి. జూలై నెలలో 4.7 శాతంగా నమోదైన పారిశ్రామిక ప్రగతి ఆ మరుసటి నెలలోనే మైనస్‌లోకి పడిపోవడం విశేషం. గత నెలలో -0.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో 10.9 శాతంగా నమోదైంది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐఐపీ రేటు 4.2 శాతంగా నమోదైంది. గనులు, తయారీ, విద్యుత్ రంగాలు పడకేయడంతో మొత్తం పారిశ్రామిక రంగంపై పడింది.
గత నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా వర్షాలు కురియడంతో గనుల రంగంలో వృద్ధి మైనస్ 4.3 శాతానికి పడిపోయినట్లు గణాంకాల శాఖ వెల్లడించింది. చివరి సారిగా అక్టోబర్ 2022లో -4.1 శాతానికి పడిపోయిన పారిశ్రామిక రంగం మళ్లీ ఇప్పుడే రుణాత్మకానికి జారుకోవడం. అలాగే క్యాపిటల్ విభాగం కూడా 13.1 శాతం నుంచి 0.7 శాతానికి పడిపోయిందని తెలిపింది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ ఉత్పాదకత కూడా 9.9 శాతం నుంచి మైనస్ 4.5 శాతానికి జారుకున్నది. కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విభాగం మాత్రం 5.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. క్రితం ఏడాది ఇది 6 శాతంగా ఉన్నది.
ఇతర రంగాలతో పోలిస్తే మౌలిక సదుపాయాల రంగం ఆశాజనక పనితీరు కనబరిచింది. గత నెలకుగాను మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగం 1.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం 15.7 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ కొంతలో కొంత మెరుగైన పనితీరు కనబరిచింది. అలాగే ప్రాథమిక వస్తువులు కూడా -2.6 శాతానికి పడిపోయాయి. క్రితం ఏడాది ఇది 10 శాతానికి పైగా నమోదైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతోపాటు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి.