Stock Markets | ముంబై, జూలై 19: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. రికార్డు స్థాయి గరిష్ఠాల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్య అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ఈ పరిణామం భారతీయ మార్కెట్ల నష్టాలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 738.81 పాయింట్లు లేదా 0.91 శాతం పడిపోయి 81 వేల మార్కుకు దిగువన 80,604.65 వద్ద ముగిసింది. నిజానికి తీవ్ర ఒడిదొడుకుల్లోనే ట్రేడింగ్ సాగింది. ఒకానొక దశలో గురువారం ముగింపుతో చూస్తే 244 పాయింట్లకుపైగా ఎగిసి ఆల్‌టైమ్ హైని తాకుతూ 81,587.76 వద్దకు సూచీ వెళ్లింది. అయితే ఈ ఉత్సాహం ఎంతోసేపు నిలబడలేకపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో 844.36 పాయింట్ల నష్టాన్ని సెన్సెక్స్ మూటగట్టుకోవడం గమనార్హం. చివరకు కొంతమేర కోలుకున్నా.. నష్టతీవ్రత ఎక్కువగానే ఉన్నది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 269.95 పాయింట్లు లేదా 1.09 శాతం దిగజారి 24,530.90 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో మునుపెన్నడూ లేనివిధంగా 24,854.80 స్థాయికి చేరినా.. నిలదొక్కుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే 292.7 పాయింట్ల మేర నష్టపోయింది. అయితే ఆఖర్లో కాస్త కోలుకున్నది. అంతకుముందు 4 రోజులపాటు స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కదలాడిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 1,446.12 పాయింట్లు లేదా 1.80 శాతం పుంజుకున్నది.
మెటల్ రంగ షేర్లు అత్యధికంగా 4.11 శాతం పడిపోయాయి. కమోడిటీస్ 3.07 శాతం, చమురు-గ్యాస్ 2.87 శాతం, విద్యుత్తు 2.67 శాతం, ఆటో 2.53 శాతం, యుటిలిటీస్ 2.51 శాతం, రియల్టీ 2.44 శాతం, సేవలు 2.42 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్ షేర్ విలువ 5 శాతానికిపైగా దిగజారింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటర్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య.. అన్ని రంగాలనూ ప్రభావితం చేసింది. దీంతో ఆయా దేశాల స్టాక్ మార్కెట్లపైనా ఈ ప్రభావం కనిపించింది. ఆసియా దేశాల్లో ప్రధానంగా దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టాలను చవిచూశాయి. చైనా సూచీ లాభపడింది. అలాగే కీలక ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ నష్టపోయాయి. గురువారం నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లూ.. శుక్రవారం తీవ్ర ఒడిదొడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ దెబ్బకు విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకింగ్, మీడియా రంగాల్లోనూ ఇబ్బందులు తలెత్తాయి. కాగా, భారతీయ స్టాక్ మార్కెట్లపై సాంకేతికంగా మైక్రోసాఫ్ట్ ప్రభావం లేదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రకటించాయి.
స్టాక్ మార్కెట్ల నష్టాల నేపథ్యంలో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లదాకా ఆవిరైపోయింది. రూ.7,94,059. 53 కోట్లు క్షీణించి రూ.4,46,38,826.75 కోట్ల (5.34 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. వరుస లాభాల మధ్య మదుపరుల సంపద రూ.455 లక్షల కోట్లనూ తాకిన సంగతి విదితమే.