ముంబై, నవంబర్ 21 : ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ విలవిల్లాడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూలేని స్థాయికి దిగజారింది. ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి రూపీ 89 మార్కును దాటి 90 దరిదాపుల్లోకి వెళ్లింది మరి. ఈ ఒక్కరోజే ఏకంగా 98 పైసలు పడిపోయి 89.66 వద్ద నిలిచింది. ఇలా ఒక్కరోజే ఇంతలా నష్టపోవడం దాదాపు 4 ఏండ్ల తర్వాత ఇదే కావడం గమనార్హం. నిజానికి ఉదయం ఆరంభంలో కాస్త బలపడినప్పటికీ.. సమయం గడస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నది.
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్ వద్ద ట్రేడింగ్ ఆరంభంలో రూపీ 88.67 వద్ద మొదలైంది. ఒకానొక దశలో 88.59 స్థాయికి పుంజుకున్నది. కానీ మధ్యాహ్నం సమయానికి తీవ్ర ఒడిదొడుకుల్లోకి వెళ్లింది. అమెరికాలో భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఇంకా కుదరని ట్రేడ్ డీల్.. రూపీని ఒత్తిడికి గురిచేసిందని ట్రేడర్లు చెప్తున్నారు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్, భారత్ సహా ఆసియాలోని ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా బలహీనపర్చిందని వారు విశ్లేషిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలు, ఏఐ ఆధారిత టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాలు కూడా కరెన్సీ మార్కెట్‌ను షేక్ చేశాయి. ఇక గత 5 సెషన్లలో 0.09 శాతం పెరిగి 100.17కు డాలర్ ఇండెక్స్ ఎగబాకింది.
ప్రస్తుత రూపాయి పతనాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బగానే ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. రూపాయి విలువ పడిపోతే విదేశాల నుంచి దేశంలోకి వచ్చే ప్రతీ వస్తూత్పత్తి ధర పెరుగుతుందని, ఇది చివరకు ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా దేశీయ చమురు అవసరాలు 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రో రేట్లు పెరగడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే రవాణా వ్యయం ఒక్కసారిగా భారమైపోతుంది. ఫలితంగా పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతాయి. సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. కాగా, రష్యా నుంచి చౌకగా వచ్చే ముడి చమురును దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు అడ్డుపడుతున్న వేళ.. రూపీ క్షీణత భారత జీడీపీకి ముమ్మాటికీ ముప్పే. ఇక ద్రవ్యోల్బణం దిగొస్తున్నదని ఇప్పుడిప్పుడే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తున్నది. రూపాయి విలువ దిగజారితే మళ్లీ వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యత కష్టమవుతుంది. ఇది ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపే వీలున్నది. చివరకు నిరుద్యోగ సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా డాలర్‌తో చూస్తే రూపాయి స్థాయికి సంబంధించి ఎలాంటి టార్గెట్ లేదన్న మరుసటిరోజే ఇంతటి నష్టం వాటిల్లడం కూడా ఇప్పుడు ప్రాధాన్యతను దక్కించుకుంటున్నది.
