ముంబై, ఆగస్టు 29: దేశీయ కరెన్సీ రికార్డు స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ మార్కె ట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు కుదేలయ్యాయి. ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గించడమే తమ ఏజెండా అన్న ఫెడరల్ రిజర్వు చైర్మన్ వ్యాఖ్యలు ఫారెక్స్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో సోమవారం ప్రారంభంలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయి 80.15కి పడిపోయింది. మారకం పతనాన్ని కట్టడి చేయడానికి రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగడంతో చివర్లో భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 7 పైసలు తగ్గి 79.91 వద్ద ముగిసింది. గత నెలలో రూపాయి విలువ 80 దాటి 80.05కి పడిపోయిన విషయం తెలిసిందే.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫెడ్ ప్రకంపనాలు సృష్టించింది. ఇంట్రాడే 1,460 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకొని 861.25 పాయింట్లు నష్టపోయి 57,972.62 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 246 పాయింట్లు తగ్గి 17,312.90 వద్దకు జారుకున్నది.