ముంబై, డిసెంబర్ 10: వచ్చే ఏడాది ఆఖరుకల్లా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 29,000 పాయింట్లను చేరుకోవచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ బుధవారం అంచనా వేసింది. ఇది 12 శాతం వృద్ధికి సమానం కావడం విశేషం. రాబోయే ఏడాది కాలంలో భారతీయ సంస్థలు ఆకర్షణీయ లాభాలను నమోదు చేసే వీలుందంటున్న కొటక్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శ్రీపాల్ షా..
ఈ క్రమంలోనే 2026 డిసెంబర్ నాటికి నిఫ్టీ 29,120 పాయింట్ల వద్ద ఉండొచ్చన్నారు. దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల్లో 17 శాతం వృద్ధికి అవకాశాలున్నాయని ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇక బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాల షేర్లు ఆకర్షణీయమని పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మూడోరోజూ సూచీలు లాభాలకు దూరంగానే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 275.01 పాయింట్లు లేదా 0.32 శాతం పడిపోయి 84,391.27 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ మరో 81.65 పాయింట్లు లేదా 0.32 శాతం దిగజారి 25,758 వద్దకు పతనమైంది. కాగా, మీషో.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలతో నమోదైంది. ఇష్యూ ధర రూ.111తో పోల్చితే 53 శాతానికిపైగా ప్రాఫిట్స్ను అందుకున్నది. మార్కెట్ విలువ దాదాపు రూ.77,000 కోట్లకు చేరింది. బీఎస్ఈలో రూ.170.20, ఎన్ఎస్ఈలో రూ.170.45 వద్ద షేర్లు ముగిశాయి.