న్యూఢిల్లీ, మే 15: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ అస్థిరత సూచీ (ఇండియా వీఐఎక్స్) గుబులు పట్టుకున్నది. విపరీతంగా పెరిగిన ఈ సూచీ.. స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులకు నిదర్శనమని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలుపు అంచనాలపై మదుపరులలో ఉన్న ఆందోళనల వల్లే ఈ ఆటుపోట్లంటూ మంగళవారం మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోదీ సర్కారు ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను, అటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే జయశంకర్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో, సీతారామన్ బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో ప్రసంగిస్తూ వీఐఎక్స్ను ప్రస్తావించారు. వ్యాపారులు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ధైర్యాన్ని నూరిపోశారు.
నిజానికి గతకొద్ది నెలలుగా ఈ ఇద్దరు మంత్రుల్ని.. వ్యాపార-పారిశ్రామిక రంగాల పెద్దలను, దేశ-విదేశీ మదుపరులను ఆకట్టుకోవడానికి మోదీ సర్కారు వినియోగించుకుంటున్నది. పెట్టుబడులు ఆగితే అది జనాల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నది మరి. ఇక వీఐఎక్స్పై జయశంకర్ మాట్లాడుతూ.. ప్రగతికి ఆస్కారమున్న రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మోదీ ప్రభుత్వం దానికి పెద్దపీట వేస్తుందని వివరించారు. అంతకుముందు రోజు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి స్పష్టమైన, బలమైన మెజారిటీ వస్తుందని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అన్ని నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతుందని చెప్పారు. బీఎస్ఈలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో ఒడిదొడుకుల సూచీ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అన్నారు.
వీఐఎక్స్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పైకి వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి వర్గాలకు కేంద్రం చెప్తున్నా.. లోపల మాత్రం భయపడుతూనే ఉన్నది. అందుకే మంత్రుల చేత పదేపదే ఈ అంశంపై మాట్లాడుతూ వస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో, ఎంఎస్ఎంఈలతో జయశంకర్, సీతారామన్‌లు సమావేశమవుతుండటం గమనార్హం.