ప్రదీప్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. ముందుచూపుతో తెలివిగా ఆలోచించి కుటుంబం మొత్తానికీ రూ.15 లక్షలతో ఓ ఆరోగ్య బీమాను తీసుకున్నాడు.
రెండేండ్లుగా ఏటా ప్రీమియంలనూ చెల్లిస్తున్నాడు. ఇంతలో తన కుమారుడికి అనారోగ్య సమస్య వచ్చింది. వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా.. అన్న ధైర్యంతో సమీపంలోని ఓ పెద్ద కార్పొరేట్ దవాఖానలో చేర్చాడు.
కానీ చికిత్స జరుగుతుండగా.. బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైంది. సరైన పత్రాలు లేవంటూ బీమా సంస్థ చెప్పింది. అన్ని పత్రాలను సమర్పించినా ఈ రకమైన సమాధానం రావడం ప్రదీప్‌ను ఎంతగానో నిరాశపర్చింది. ఏం చేయాలో తెలియక అయోమయంలోపడ్డ ప్రదీప్‌ను ఆసుపత్రి బిల్లులు ఇంకింత ఆందోళనలోకి నెట్టాయి. ఈ పరిస్థితి మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. అందుకే ఇలాంటి కేసుల్లో ఐఆర్డీఏఐ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. మరి అవేంటో తెలుసా..
Health Insurance | ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు. అయితే పెరుగుతున్న క్లెయిముల్లో ఎక్కువగా తిరస్కరణకు గురవుతుండటం కనిపిస్తున్నది. వీటన్నింటినీ పరిశీలించిన బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం.
గత ఏడాది పాలసీదారుల ప్రయోజనాల రక్షణార్థం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తెచ్చిన మార్గదర్శకాలు.. డాక్యుమెంటేషన్ అవసరాలను చాలా సులభతరం చేసింది. దీంతో పాలసీదారులపై అనవసరపు పత్రాలను సమీకరించే భారం తగ్గిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కావాల్సిన డాక్యుమెంట్లు లేవని బీమా సంస్థలు మీ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను తిరస్కరిస్తే.. ఏం చేయాలో ఐఆర్డీఏఐ తమ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. క్లెయిమ్‌లో మీకున్న న్యాయపరమైన హక్కులనూ తెలియజేసింది. వాటిలో..
క్లెయిమ్ పరిష్కారంలో బీమా సంస్థ పనితీరు నిరాశాజనకంగా, అభ్యంతరకరంగా ఉంటే.. సదరు బీమా కంపెనీ ఫిర్యాదుల పరిష్కార విభాగానికి పాలసీదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును అందుకున్న 15 రోజుల్లోగా బీమా సంస్థలు దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మీకు లభించే రశీదుతో అది ఏ దశలో ఉందన్నది కూడా పాలసీదారులు తెలుసుకోవచ్చు. తద్వారా మీ కైంప్లెంట్ను ట్రాకింగ్ చేయవచ్చు. ఒకవేళ బీమా సంస్థ సమాధానం మిమ్మల్ని సంతృప్తిపర్చకపోతే.. ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. అయినప్పటికీ న్యాయం జరుగలేదని భావిస్తే.. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.