కోటి రూపాయలను మీరు ఎన్నేండ్లలో సంపాదించాలని చూస్తున్నారు? ఐదేండ్లు.. ఏడేండ్లు.. పదేండ్లు.. 12 ఏండ్లు లేదా 15 ఏండ్లు? దీనికి మీ సమాధానం ఏదైనా.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దీర్ఘకాల పెట్టుబడులు పెడితే మాత్రం వచ్చే చక్ర వృద్ధి ప్రయోజనాలు మీరు ఆశ్చర్యపోయేలాగే ఉంటాయంటున్నారు ఆర్థిక నిపుణులు. మ్యూచువల్ ఫండ్ మదుపరులు.. ఏటేటా తమ నెలవారీ పెట్టుబడుల్లో పెరుగుదల లేకుండా కూడా సిప్ ద్వారా కోటీశ్వరులు కావచ్చని చెప్తున్నారు.
నెలకు రూ.10 వేలతో..
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలనెలా రూ.10,000 పెట్టుబడితో 20 ఏండ్లకే కోటి రూపాయలను పొందవచ్చని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. నెలకు రూ.10 వేల చొప్పున 241 నెలల్లో మీ పెట్టుబడులు రూ.24 లక్షల 10 వేలకే చేరుతాయని, కానీ ఆఖర్లో కోటి రూపాయలను తీసుకోవచ్చని అంటున్నారు. ఇదే వార్షిక చక్ర వృద్ధిరేటు ఫలితమని వివరిస్తున్నారు. ఇదే క్రమంలో 15 ఏండ్లపాటు నెలకు రూ.20,000, 13 ఏండ్లపాటు రూ.25,000, 12 ఏండ్లపాటు రూ.30,000 పెట్టుబడి పెట్టినా కోటి రూపాయల ఆదాయాన్ని దక్కించుకోవచ్చు. పెట్టుబడి పెరిగినాకొద్దీ కోటి రూపాయలను అందుకునే కాలమూ తగ్గిపోతుంది. నెలకు లక్ష చొప్పున పెట్టుబడి పెడితే 70 నెలల్లోనే కోటి రూపాయలను పొందవచ్చు. రూ.30 లక్షలు ఎక్కువన్నమాట. ఇలా 241 నెలలు లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.10 కోట్లు అందుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కంటే రూ.7.59 కోట్లు అదనం.
చివరగా..
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. ఆయా మార్కెట్ల అనుసంధానంగా ఉంటాయి. కాబట్టి ఒడిదుడుకులు సహజం. అయితే ఎవరైతే దీర్ఘకాల పెట్టుబడులకు ఆసక్తి చూపుతారో వారికి ఈ పెట్టుబడులు లాభదాయకం. సుమారుగా 12 నుంచి 16 శాతం రిటర్న్స్ ఉంటాయని ట్రేడింగ్ నిపుణులు చెప్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావడం మంచిది.
Siptable