Money saving tips : మనిషి సంతోషంగా జీవించాలంటే బతకడానికి కావాల్సిన కనీస అవసరాలైనా తీర్చుకోగలగాలి. ఈ అవసరాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు అవకాశాలు, వనరులను బట్టి తమతమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది కొంతమందికి తెలియదు. అందుకే అతిగా ఖర్చు చేస్తారు. అలా చేయడంవల్ల చేతిలో డబ్బు నిలువదు. అత్యవసర పరిస్థితులు ఎదరైనప్పుడు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడాల్సి వస్తుంది. అలాంటి అవస్థలు తప్పాలంటే సంపాదించిన దానిలో నెలకు కనీసం 1% నుంచి 5% అయినా సేవ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి మనీని ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో డెబిట్, క్రెడిట్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి. చాలామంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కార్డులను ఉపయోగించడంవల్ల మీరు సాధారణం కంటే ఎక్కవ డబ్బును ఖర్చు చేస్తారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళ్తుందో పట్టించుకోరని, అతిగా ఖర్చు చేసి తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి కార్డులకు బదులుగా నగదును ఖర్చులకు వాడితే భయంతో తక్కువ ఖర్చు చేస్తారని అంటున్నారు. దాంతో డబ్బు సేవ్ అవుతుందని చెబుతున్నారు.
చాలామంది ఉపయోగం లేని వస్తువులు కొనడమో.. లేక అవసరం లేని వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చెయ్యడమో చేస్తుంటారు. ఇలా అదనపు వస్తువులకు చేసే ఖర్చు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వీలైతే వారం రోజుల్లో ఒక రోజు జీరో ఖర్చు రోజుగా పెట్టుకోండి. ఆ రోజు మాత్రం ఎలాంటి ఖర్చు చెయ్యకుండా డబ్బును సేవ్ చెయ్యండి. ప్రతి వారం మీ ఖర్చును తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు.
ఈ రోజుల్లో చాలామంది బడ్జెట్‌కు మించిన ప్లాన్‌ని ఎంచుకుంటారు. మీరు మీ ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో బాగా పరిశీలించండి. మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాన్లను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఎక్కువ డేటాను ఉపయోగించనప్పటికీ రిచార్జ్ ప్లాన్ మాత్రం భారీగా చేసుకుంటారు. అలాగే ఇంట్లో ఉండే టీవీ రిచార్జ్ ప్లానింగ్‌లోనూ అలాంటి తప్పులే చేస్తే సరిదిద్దుకోండి. టీవీ ప్లాన్‌లో మీకు ఉన్న అన్ని ఛానెల్‌లు నిజంగా అవసరమా అది కూడా ఆలోచించండి. అలా మీరు చూసే చానెల్స్‌కు మాత్రమే రిచార్జ్ చేయించుకుంటే ఖర్చు కొంతైనా తగ్గుతుంది.
కొందరు ఏ అవకాశం వచ్చినా పార్టీలు, విహార యాత్రలంటూ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇంట్లోనే సరదాగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యండి. దాంతో డబ్బు కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక ఈ రోజుల్లో అందరూ సొంత వాహనాలపైనే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు కారు లేదా బైక్‌ను ఉపయోగించడం కంటే ప్రజా రవాణాను ఉపయోగిస్తే ఎంతో కొంత ఆదా అవుతుంది. అలాగే లాంగ్ జర్నీస్‌లో బయట ఫుడ్ తినడం కంటే మీ కోసం, మీ పిల్లల కోసం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ప్యాక్ చేయండి. డబ్బు సేవింగ్తోపాటు ఆరోగ్యానికి కూడా హాని ఉండదు.
చాలామంది ఇళ్లల్లో అవసరం లేని వస్తువులు ఉంటాయి. వాటిని స్టోర్ రూమ్‌లో వేసి చేతులు దులుపుకుంటారు. కానీ అలాంటి అనవసరపు వస్తువులు ఇంట్లో ఉంటే అమ్మేయడం మంచిది. ఎందుకంటే అవసరం లేని వస్తువులు ఇంట్లో ఉంటే ఇళ్లు ఇరుకుగా అనిపిస్తుంది. ఎటు చూసినా వస్తువులే కనిపించడంవల్ల మనసుకు కూడా చికాకుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వస్తువులను వెంటనే అమ్మేయాలి. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో వస్తువులను విక్రయించడం గతంలో కంటే సులభం. ఏదైనా పాత వస్తువు ప్లేస్‌లో కొత్తది కొనాలనుకున్నప్పుడు.. పాతదాన్ని రీప్లేస్ చేసుకుంటే డబ్బు ఆదా అవుతోంది.
మరో ముఖ్యమైన విషయం బాటిల్ వాటర్. ఈ విషయంలో చాలామంది అనుకోకుండానే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తారు. రోజుకు రూ.20 మాత్రమే కదా అని నీళ్లు కొనుక్కొస్తుంటారు. కానీ నెలకు లెక్క చూస్తే పెద్ద మొత్తమే ఖర్చవుతుంది. అలా కాకుండా ట్యాప్ వాటర్ తాగితే మనీ సేవ్ అవుతుంది. ఒకవేళ టాప్ వాటర్ తాగేందుకు మీరు ఇష్టపడనట్లయితే మీ వంటగదిలో వాటర్ ఫిల్టర్ పెట్టించుకోండి. ఇది కాస్త పెద్ద పెట్టుబడే అయినప్పటికీ.. రోజూ బాటిల్ వాటర్ కొనుగోలుతో పోల్చుకుంటే దీర్ఘకాలికంగా పొదుపే అవుతుంది.