PF Account | ఉద్యోగులు తీసుకునే వేతనాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కూడా భాగమే. ఆయా కంపెనీల యాజమాన్యాలు.. సిబ్బంది జీతాల నుంచి కొంత సొమ్మును మినహాయించి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తాయి. తమ వాటాగా కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తాయి. అయితే ఈ పీఎఫ్ ఖాతాలను సదరు కంపెనీల ట్రస్టులుగానీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)గానీ నిర్వహిస్తాయి. ఒకవేళ జీతాలిచ్చే సంస్థకే పీఎఫ్ ట్రస్టు ఉంటే.. అది ‘ఎగ్జెంప్టెడ్’ లేదా ‘అన్ఎగ్జెంప్టెడ్’ అన్నది కీలకం. ఎందుకంటే తమ జీతంలో నుంచి నెలనెలా మినహాయించబడుతున్న ఈపీఎఫ్ విరాళాలపై ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీతోపాటు ఇతర సెక్షన్ల కింద ఉద్యోగి పొందే పన్ను ప్రయోజనాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి మరి.
ఎగ్జెంప్టెడ్ ట్రస్టు ఈపీఎఫ్‌వో, ఐటీ శాఖల గుర్తింపు పొంది ఉంటుంది. దీంతో ఉద్యోగుల సొమ్ము నిర్వహణకు నిర్ణీత ఈపీఎఫ్‌వో నిబంధనలను ఈ ట్రస్టులు పాటించాలి. ఇక అన్ఎగ్జెంప్టెడ్ ట్రస్టుకు అటు ఈపీఎఫ్వోగానీ, ఇటు ఐటీ శాఖ నుంచిగానీ ఏ రకమైన గుర్తింపులు ఉండవు. కాబట్టి మీ పీఎఫ్ ఖాతా.. ఈపీఎఫ్‌వోలో లేదా ఎగ్జెంప్టెడ్ ట్రస్టులోనో ఉంటేనే వివిధ పన్ను మినహాయింపులకు మీకు అర్హత ఉంటుంది. తన ఈపీఎఫ్ విరాళంపై సెక్షన్ 80సీ మినహాయింపును ఉద్యోగి అప్పుడే క్లెయిం చేసుకోగలరు. ఇక షరతులకు లోబడి ఈ ఈఎపీఎఫ్ ఖాతాల్లో సంస్థ తరఫున జమయ్యే విరాళాలకూ పన్నులుండవు. అంతేగాక ఉద్యోగితోపాటు సంస్థ చేసే విరాళాలపై పొందే వడ్డీ ఆదాయంపైనా షరతులకు లోబడి పన్ను మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఈపీఎఫ్ సొమ్ముకూ పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఈపీఎఫ్ విరాళాల సొమ్మును కంపెనీలు అన్ఎగ్జెంప్టెడ్ ట్రస్టుల్లో రెండు విధాలుగా జమ చేస్తాయి. ఉద్యోగుల వాటాలోకి కొంత, సంస్థ వాటాలోకి ఇంకొంత డిపాజిట్ చేస్తాయి. ఈ రెండింటిపైనా వడ్డీ ఆదాయం ఉంటుంది. కాగా, ఉద్యోగుల ద్వారా అన్ఎగ్జెంప్టెడ్ ట్రస్టు నిర్వహణలోని ఈపీఎఫ్‌లోకి చేరిన విరాళంపై మెచ్యూరిటీ లేదా విత్‌డ్రాయల్ సమయంలో పన్నుండదు. ఎందుకంటే ఈ విరాళాన్ని సేకరించేటప్పుడే పన్ను పడుతున్నది. అయితే వడ్డీ ఆదాయంపై మాత్రం విత్‌డ్రాయల్ లేదా మెచ్యూరిటీ సమయంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సంస్థ ద్వారా ఈపీఎఫ్‌లోకి చేరిన విరాళంపై మెచ్యూరిటీ లేదా విత్‌డ్రాయల్ సమయంలో పన్నుంటుంది. వడ్డీ ఆదాయంపైనా పన్నులు వర్తిస్తాయి. ఉద్యోగి ఆదాయం ఆధారంగా వర్తించే ఆదాయ పన్ను శ్లాబు రేట్ల ప్రకారం ఈ పన్నులుంటాయి.
అన్ఎగ్జెంప్టెడ్ ఈపీఎఫ్ ట్రస్టులకు ఏ పన్ను ప్రోత్సాహకాలు ఉండవు. వాటిలోని పీఎఫ్ ఖాతాదారులకు ఐటీ చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద లభించే మినహాయింపులు, ప్రయోజనాలు రావు.
-సరస్వతి కస్తూరిరంగన్, డెలాయిట్ ఇండియా భాగస్వామి
అన్ఎగ్జెంప్టెడ్ ఈపీఎఫ్ ఖాతాల్లోని సొమ్ముకు ఎప్పటికైనాసరే ఉద్యోగులు తమ ఆదాయ పన్ను శ్లాబు రేట్ల ప్రకారం పన్నులు చెల్లించాల్సిందే. చివరకు వడ్డీ ఆదాయానికీ పన్నులు వర్తిస్తాయి.
-సంకేత్ జైన్, పయనీర్ లీగల్ భాగస్వామి