Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర స్థాయిలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. గడిచిన నెల 15 రోజులుగా సూచీలు పడుతూలేస్తూనే పయనిస్తున్నాయి. దేశ, విదేశీ ప్రతికూలతల నడుమ మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. అయితే అమ్మకాలు.. లేదంటే కొనుగోళ్లకు పెద్దపీట వేస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే గత వారం సూచీలు పెద్ద ఎత్తున లాభాలను అందుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,536.80 పాయింట్లు లేదా 1.98 శాతం ఎగిసి 79,117.11 వద్ద నిలిచింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 374.55 పాయింట్లు లేదా 1.59 శాతం ఎగబాకి 23,907.25 దగ్గర ముగిసింది. ఆ మునుపటి వారం ఇంతకన్నా ఎక్కువ నష్టాలపాలైన సంగతి విదితమే. ఇక ఈ వారం విషయానికొస్తే.. మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి.
తీవ్రరూపం దాల్చుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాలో అదానీపై కేసు, క్యూ2 జీడీపీ గణాంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు కూడా ముఖ్యమే. దీంతో ఆటుపోట్లకు ఆస్కారం ఎక్కువగానే ఉన్నది. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,300-24,500 మధ్యకు వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారా?
ఒక కంపెనీ షేర్లను దాని ఈక్విటీలో పాల్గొని మదుపరులు కొనుగోలు చేయవచ్చు. లిస్టెడ్ కంపెనీలైతే వాటి షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో నమోదై ఉంటాయి. దీంతో ఎక్సేంజీల ద్వారా వాటిని కొనవచ్చు. ఇందుకు డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో కూడిన డీమ్యాట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లు అవసరం. అలాగే షేర్ల క్రయవిక్రయాల కోసం బ్రోకర్‌తో ఓ ట్రేడింగ్ అకౌంట్‌ను తెరవడం కూడా ముఖ్యమే.
ఈటీఎఫ్‌ల ద్వారా..
ఏదో ఒక షేర్లో పెట్టుబడులు పెట్టడానికి బదులుగా ఎక్సేంజ్‌పై నమోదైన ఎక్సేంజ్ ట్రేడెడ్ ఇండెక్స్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను కొనడం ద్వారా మొత్తం ఇండెక్స్‌లోనే పాలుపంచుకోవచ్చు. అలాగే ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్.. పెట్టుబడి వైవిధ్యాన్ని కూడా చూపిస్తుంది.
ఈక్విటీ ఎంఎఫ్‌లు
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీముల ద్వారా కూడా ఈక్విటీల్లో మదుపు చేయవచ్చు. ఈ పథకాలు తమ దగ్గరున్న నిధుల్లో 65 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మొత్తాలను ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడుతాయి. ఎంఎఫ్ వెబ్సైట్ల నుంచి ఆన్లైన్లో లేదా డిస్ట్రిబ్యూటర్ ఆధారిత ఎంఎఫ్ లావాదేవీ పోర్టల్‌ల ద్వారా పెట్టుబడులకు వీలుంటుంది. సిప్ ద్వారా కూడా పెట్టుబడులకు దిగవచ్చు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.