ఆర్బీఎల్ బ్యాంక్ (రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్) డిపాజిటర్లు, ఇతర స్టేక్హోల్డర్లు ఆందోళన చెందనక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. వివిధ వార్తల కారణంగా ఆ బ్యాంక్ షేరు స్టాక్ ఎక్సేంజీల్లో కుప్పకూలిన సందర్భంగా ఆర్బీఐ ప్రకటన వెలువడింది. బ్యాంక్ ఎండీ, సీఈవో విశవిర్ అహూజా రాజీనామా చేయడం, ఆ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో రిజర్వ్ బ్యాంక్ ఒక అదనపు డైరెక్టర్‌ను నియమించిందన్న వార్తలతో షేరు సోమవారం నిలువునా పతనమయ్యింది. బీఎస్ఈలో ఈ షేరు 18 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ఠస్థాయి రూ. 141 వద్ద ముగిసింది. బ్యాంక్ తగినంత మూలధనాన్ని కలిగిఉందని, ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ ప్రకటన పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 16.3 శాతంగానూ, ప్రొవిజన్ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్) 76.6 శాతంగా ఉందని ఆర్బీఐ తెలిపింది.