న్యూఢిల్లీ, జనవరి 10: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.855.78 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.723.54 కోట్ల లాభంతో పోలిస్తే 18.28 శాతం ఎగబాకింది. ఆదా యం అధికంగా పుంజుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.15,972.55 కోట్ల నుంచి రూ.18, 100.88 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.15,001.64 కోట్ల నుంచి రూ.16,942.62 కోట్లకు ఎగబాకాయి. మరోవైపు, ప్రస్తుతం సీఈవోగా విధులు నిర్వహిస్తున్న అన్షుల్ అసావాను పూర్తిస్థాయి సీఈవో, ఎండీగా నియమిస్తూ కంపెనీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.