Muhurat Trading | సాధారణంగా దీపావళి రోజున జరిగే స్టాక్ మార్కెట్ మూరత్ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది మధ్యాహ్నం జరుగనున్నది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యులర్ జారీ చేశాయి. సర్క్యులర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం మూరత్ ట్రేడింగ్ సాయంత్రం జరిగేది. కానీ, ఈ సారి మాత్రం దీపావళి మూరత్ ట్రేడింగ్ ఈ నెల 21న మధ్యాహ్నం 1.45గంటల నుంచి 2.45 గంటల వరకు జరుగుతుందని సర్క్యూలర్‌లో ఎన్ఎస్ఈ పేర్కొంది. శని, ఆదివారాల్లో మార్కెట్లు మూతపడగా.. సోమవారం ట్రేడింగ్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక ఈ నెల 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వర్గాలు పేర్కొన్నారు. లక్ష్మీపూజ సందర్భంగా 21న గంట పాటు ప్రత్యేకంగా ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుందని.. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ సెషన్‌ను ప్రవితంగా భావిస్తారు. అయితే, గతంలో కంటే ఈ సారి భిన్నంగా మధ్యాహ్నం సమయంలో ట్రేడింగ్ జరుగుతున్నది. గత సంవత్సరం 2024 పండుగ సీజన్లో రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 79,724 పాయింట్ల వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50.99 పాయింట్లు పెరిగి 24,304 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా.. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం 2025-28కి స్వాగతం పలుకుతూ ఈ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ట్రేడింగ్ లాభ నష్టాలకు అతీతంగా ఉంటుంది. రాబోయే ఏడాదిలో సంపద, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శుభారంభంగా ట్రేడర్లు ట్రేడింగ్ భావిస్తారు. బ్రోకర్లు, కుటుంబీకులు, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా పాల్గొని షేర్లను కొనుగోలు చేసి కొత్త ఖాతాలను తెరుస్తారు. ఈ సెషన్లో ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పటికీ.. సెంటిమెంట్ బలంగా ఉండడంతో మార్కెట్లు సానుకూలంగా ఉంటాయి. గత 13 సంవత్సరాలుగా మూరత్ సమయంలో సూచీలు లాభాల్లో కొనసాగడం విశేషం. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొన్న క్లిష్ట సమయాల్లోనూ సెన్సెక్స్ 5.86శాతం వృద్ధిని నమోదు చేసింది.