న్యూఢిల్లీ, నవంబర్ 11 : నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.12.92 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా పెరగడం, రీఫండ్లు తగ్గుముఖం పట్టడంతో గతేడాది ఇదే సమయంలో వసూలైనదాంతో పోలిస్తే 7 శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు రీఫ్ండ్ 18 శాతం తగ్గి రూ.2.42 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.
ఇదే కాలంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.5.08 లక్షల కోట్ల నుంచి రూ.5.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే కార్పొరేటేతర పన్ను వసూళ్లు రూ.7.19 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలానికిగాను రూ.6.62 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూ.35,682 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కార్ రూ.25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నది.